Chandrababu on Summer Power Plan : విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. దీనికోసం సాంకేతికత ఆధారంగా కరెంట్ డిమాండ్ అంచనాలను పక్కాగా రూపొందించాలని స్పష్టంచేశారు. వేసవిలో విద్యుత్‌శాఖ సన్నద్ధతపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వాతావరణ నివేదిక ఆధారంగా కృత్రిమ మేధను వినియోగించి డిమాండ్ అంచనాలను ఇంధనశాఖ రూపొందిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇంకా కచ్చితత్వం కోసం భూమిలో తేమశాతం, భూగర్భ జలాల డేటాను కూడా ఏఐకి అనుసంధానించాలని చెప్పారు. దీనివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమనే లెక్కలు వస్తాయన్నారు.
నష్టాలను ఇంకా తగ్గించాలి: విద్యుత్ అంతరాయాలను సాధ్యమైనంత మేరకు తగ్గించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రాంతాలవారీగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు. తరచూ కరెంట్ అంతరాయం తలెత్తే ప్రాంతాల్లో కారణాలను గుర్తించి పరిష్కరించాలని సూచనలు చేశారు. విద్యుత్ సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న విధానంలోనే సిబ్బంది పనితీరుపైనా సర్వే చేయాలని వివరించారు. డిస్కంల సరఫరా నష్టాలను ఇంకా తగ్గించాలని చెప్పారు. దీనికోసం సబ్‌స్టేషన్, ఫీడర్ స్థాయిలో మీటర్లు ఏర్పాటుచేసి ఎనర్జీ ఆడిట్ చేయాలని తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయొద్దని ఎక్కువ సరఫరా నష్టాలు వచ్చే ఫీడర్ల పరిధిలో అవసరమైతే డ్రోన్ల ద్వారా కారణాలు గుర్తించాలని పేర్కొన్నారు.
జెన్‌కో, కోల్ ఇండియా భాగస్వామ్యంతో ఒడిశాలోని తాల్చేరులో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుచేసే ప్రతిపాదనను పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల్లో ప్లాంట్ ఏర్పాటుచేస్తే బొగ్గు రవాణా వ్యయం భారంగా మారుతుందని చెప్పారు. ఇక మీదట బొగ్గు గనులకు సమీపంలో థర్మల్ కేంద్రాలనే ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించాలని సూచనలు చేశారు. వాటి నుంచి వచ్చే కరెంట్‌ను నిల్వ చేసేందుకు పీఎస్పీలు, బ్యాటరీ స్టోరేజి ప్లాంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు.
అన్ని జెన్‌కో యూనిట్లు పనిచేసేందుకు వీలుగా బొగ్గు సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు గ్రిడ్ పీక్ డిమాండ్ రికార్డు స్థాయిలో 12,260 మెగావాట్లుగా మంగళవారం నమోదైంది. జనవరిలో 11,807 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్‌గా నమోదైంది. జనవరిలో 6343 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదుకావడం ఇదే తొలిసారని ఇంధనశాఖ తెలిపింది.
వినూత్న ఆలోచనలతో పని చేయండి - రాష్ట్ర రాబడి పెంచండి: చంద్రబాబు