CM Chandrababu Inaugurated Urjaveer Program: దేశ, రాష్ట్ర భవిష్యత్తు అంతా విద్యుత్‌పైనే ఆధారపడి ఉందని, గృహోపకరణాల నుంచి వాహనాల వరకూ అన్నీ ఎలక్ట్రికల్‌గా మారబోతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు విద్యుత్ రంగంలో రానున్నాయని తెలిపారు. 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు. కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో నిర్వహించిన ఊర్జావీర్ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
విద్యుత్‌ను ఆదా చేయడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేయొచ్చని, దానికోసమే ఊర్జావీర్ కార్యక్రమాన్ని అందుబాటులోనికి తీసుకొచ్చినట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయానికి చిహ్నమని అన్నారు. దేశంలోనే తొలిసారిగా 1998 లోనే విద్యుత్ రంగంలో సంస్కరణలకు నాంది పలికిన ఘనత మనకే దక్కిందని చెప్పారు. 2004 నాటికి విద్యుత్ వినియోగంలో మనం పొదుపులో ఉన్నామని ఒక్క యూనిట్‌ను ఆదా చేస్తే 2 యూనిట్లను ఉత్పత్తి చేసినట్టేనని అన్నారు. కేవలం వారం వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో ఊర్జావీర్ రిజిస్ట్రేషన్‌ను 12 వేల మంది చేసుకున్నారని, వీళ్లు వారి ఉద్యోగాలు చేసుకుంటూనే నెలకు 15 వేల వరకు అదనంగా సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్ - ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు - అర్హతలు ఇవే!
రాష్ట్రంలోని 55,607 మంది అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టౌవ్‌లు, కుక్కర్లు, వంట సామగ్రిని అందజేసినట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2 నెలల్లో మొత్తం అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకూ వీటిని అందిస్తామని తెలిపారు. వీటిని వినియోగించడం వల్ల 30 శాతం విద్యుత్‌ను ఆదా చేయొచ్చని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇళ్లు, పొలంలో సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని అప్పుడే శాశ్వతంగా విద్యుత్ బిల్లులుండవని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పరిశోధనల కోసమే ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విద్యుత్ వాహనాల వినియోగం గణనీయంగా పెరగబోతోందని అందుకే రాష్ట్రంలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున కనీసం 5వేలకు పైగా పెట్టాలని నిర్ణయించామని తెలిపారు.