ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించింది: సీఎం చంద్రబాబు - CBN Independence Day Celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 9:50 AM IST

Updated : Aug 15, 2024, 10:46 AM IST

CM Chandrababu at Independence Day Celebrations: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి చంద్రబాబు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించినట్లయిందని చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)

CM Chandrababu at Independence Day Celebrations: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సాయుధ పోలీసు బలగాల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని గుర్తు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్నారు.

1956 నవంబర్‌ 1న హైదరాబాద్‌ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న సీఎం, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని పేర్కొన్నారు. తమ అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడేతత్వంతో కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నామన్నారు.

120కి పైగా సంక్షేమ పథకాలు: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి వేగంగా ముందుకెళ్లామన్న చంద్రబాబు, దేశంలో ఎవరూ ఊహించని విధంగా సంస్కరణలతో 13.5 శాతం వృద్ధి రేటుతో నిలిచామని గుర్తు చేసుకున్నారు. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమంగా నిలిచామని వెల్లడించారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని లేని రాష్ట్రమని బాధగా కూర్చోలేదని, సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నామని పేర్కొన్నారు. దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామని, రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో రాజధానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. ప్రజల సహకారంతో 34 వేల ఎకరాలు భూసేకరణ చేశామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఎప్పుడూ నమ్ముతామని స్పష్టం చేశారు.

పోలవరాన్ని పరుగులు పెట్టించాం: సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం, నాడు ఐదేళ్లలో 68 వేల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్న చంద్రబాబు, ఒక యజ్ఞం మాదిరిగా ప్రాజెక్టును పరుగులు పెట్టించామని వెల్లడించారు. 73 శాతం పనులు పూర్తిచేశామని, తామే కొనసాగి ఉంటే ఈపాటికే పోలవరం పూర్తయ్యేదన్నారు.

ఒక్క ఛాన్స్‌ పేరుతో విధ్వంసం సృష్టించారు:ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చిన గత పాలకులు విధ్వంసం సృష్టించారన్న చంద్రబాబు, బాధితులనే నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. నియంత పోకడలు, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, ఆస్తులు దోచుకున్నారని, ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో వేధించారన్నారు.

తీరని ద్రోహం చేశారు:ప్రజావేదిక ధ్వంసంతో నాటి పాలన సాగించారన్న చంద్రబాబు, నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి లేదని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. 10 లక్షల కోట్ల అప్పులు, అసమర్థ, అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిధులను దారిమళ్లించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

మా నినాదాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు: ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్న తమ నినాదాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్న చంద్రబాబు, తమపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారన్నారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. సుపరిపాలనకు తొలిరోజు నుంచి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించినట్లయిందని పేర్కొన్నారు.

అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నాం: సింపుల్ గవర్నెన్స్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ అనే నినాదంతో పని చేస్తున్నామన్నారు. ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛా స్వాతంత్య్రం, స్వేచ్ఛను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామన్న సీఎం, వంద రోజుల ప్రణాళిక లక్ష్యంగా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలను ప్రక్షాళన చేస్తున్నామని, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలకు దగ్గరగా పాలన సాగిస్తున్నామని, బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేశామని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో ప్రజల కష్టాలను చూసి మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. మదనపల్లి ఫైల్స్ లాంటి ఘటనల తరవాత అలాంటి పరిస్థితుల ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు.

బొమ్మలకు 700 కోట్లు తగలేశారు: నాడు-నేడు అని మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టిందని సీఎం మండిపడ్డారు. తాను బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశానని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయన్నారు. పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, సర్వేరాళ్లపై బొమ్మలకు 700 కోట్లు తగలేశారని ధ్వజమెత్తారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుతో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారని, మొదటి కేబినెట్‌లోనే చర్చించి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును రద్దుచేశామని గుర్తు చేశారు.

మీభూమి-మీహక్కు: భూబాధితుల కోసం మీభూమి-మీహక్కు పేరుతో రెవెన్యూ సదస్సులకు నిర్ణయించామని, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేదే తమ లక్ష్యమన్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని, పేదల సేవలో కార్యక్రమం ద్వారా పింఛన్లు పెంచి ఇంటి వద్దే ఇస్తున్నామని తెలిపారు.

నేటినుంచి 100 అన్న క్యాంటీన్లు : ఆగస్టు 1న తొలిరోజే 97 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామని, అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.5కే భోజనం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను తొలగించిందని మండిపడ్డారు. నేటినుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్న చంద్రబాబు, మొత్తం 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయజెండా ఎగరాలి : సీఎం చంద్రబాబు - CBN on Har Ghar Tiranga

గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ:యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారని, అందుకే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు. నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం అవలంభిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటు కల్పించామని, మరింత పకడ్బందీగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామన్నారు.

తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం:ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగస్వాములు అన్న సీఎం చంద్రబాబు, వారికి ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్‌ సిక్స్‌తో 6 హామీలు ఇచ్చామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని తెలిపారు. పోలవరం, అమరావతి రాజధాని, విద్యుత్ వంటి శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, తప్పుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తామని,నాటి అక్రమాలపై లోతైన దర్యాపు చేయించి అక్రమార్కులను శిక్షించి తీరుతామన్నారు.

తెలంగాణతో చర్చించి ముందుకెళ్తున్నాం:విభజన చట్టంలో ఉన్న అంశాలపై కేంద్రం, తెలంగాణతో చర్చించి ముందుకెళ్తున్నామని, వికసిత్‌ భారత్‌ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు. సైబరాబాద్‌ నిర్మాణంలో నాలెడ్జ్‌ ఎకానమీతో సంపద సృష్టించామని, విజన్‌ 2020 అనేది ముందుగానే పూర్తిస్థాయి ఫలితాలు ఇచ్చిందన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికంగా తలసరి ఆదాయం పొందుతోందన్న సీఎం, ఉమ్మడి రాష్ట్రంలో తాము తెచ్చిన పాలసీలే అందుకు కారణమని గుర్తు చేశారు. ప్రపంచంతో పోటీపడే నగరంగా హైదరాబాద్‌ ఆవిష్కృతం వెనుక మన అప్పటి విధానాలే కారణమన్నారు.

15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యం:రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్ధిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నామని, నూతన ఆలోచనలతో 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. దేవుడి దయ వల్ల సాగునీటి ప్రాజెక్టులకు జులైలోనే జలకళ వచ్చిందన్న చంద్రబాబు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయన్నారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరందిస్తామని, రైతుల ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని భరోసానిచ్చారు. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం తమ ప్రభుత్వ విధానమన్న చంద్రబాబు, గత ప్రభుత్వ అసమర్థతతో దెబ్బతిన్న పోలవరాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్తామన్నారు.

కేంద్రంతో సంప్రదింపులు జరిపి పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం 990 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం కింద ప్రభుత్వ భవనాలు, ఇళ్లపై సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్ అవసరాల కోసం సోలార్, పంప్డ్, బ్యాటరీ, బయో, గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

త్వరలోనే ఆన్‌లైన్‌, సచివాలయాల్లో బుకింగ్ సదుపాయం: సీఎం చంద్రబాబు - CM Teleconference with Activists

Independence Day@78: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రమని ఆయన అన్నారు. వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదని కొనియాడారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శమన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, తాడితపీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠమని తెలిపారు.

అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామన్నారు. అభివృద్ధి ఫలాలను అందరికి అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

పంచాయతీలకు పూర్వవైభవం - స్వాతంత్య్ర దినోత్సవాల కోసం భారీగా నిధులు - INDEPENDENCE DAY FUNDS IN AP

Last Updated : Aug 15, 2024, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details