PDS RICE FRAUD IN AP : రేషన్ బియ్యం పంపిణీలో వైఎస్సార్సీపీ నాయకుల అనుయాయులకు టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చడమే గాకుండా చెల్లించాల్సిన డిపాజిట్ మొత్తాన్ని కూడా తగ్గించారు. టెండరు విలువ రూ.100 కోట్లు దాటితే న్యాయ సమీక్షకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో వాటిని విభజించి అప్పగించారు. పేదలకు పంపిణీ చేయాల్సిన పామాయిల్, కందిపప్పు, గోధుమపిండి, రాగిపిండి సరఫరాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినా తమ పార్టీ నేతలే కదా అని ప్రభుత్వం దోపిడీకి సహకరించింది.
రేషన్ సరుకులు సరఫరా చేసే వాహనాల (ఎండీయూలు) కారణంగా పౌరసరఫరాల సంస్థకు రూ.1,500 కోట్ల నష్టం కలిగిందని కూటమి ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తేల్చారు. సార్టెక్స్ (నూక శాతం తక్కువగా ఉన్న బియ్యం) పేరుతో సరఫరా చేసే బియ్యాన్ని తినగలిగే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు విక్రయిస్తున్నారని తెలిపారు. అయినా సార్టెక్స్ పేరుతో నెలకు రూ.20 కోట్ల చొప్పున ఏటా రూ.240 కోట్లు వ్యయం లెక్కలు చూపించారని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడ కేంద్రంగా ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం- సీఐడీతో దర్యాప్తు చేయిస్తామన్న మంత్రి మనోహర్ - Ration rice mafia
- గత ప్రభుత్వ హయాంలో కందిపప్పు సరఫరా అరకొరగానే ఉంది. ఏడాది నుంచి పంపిణీ లేకపోగా అంతకు ముందు కొన్ని నెలలుగా కొనసాగిన పంపిణీపై న్యాయ సమీక్షకు వెళ్లకుండా విడివిడిగా టెండర్లు పిలిచారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి డిపాజిట్ సొమ్మును తగ్గించడంతో పాటు మార్కెట్లో కిలో రూ.80 ఉంటే రూ.118 చొప్పున కాంట్రాక్టు అప్పగించడం గమనార్హం.
- పామాయిల్ సరఫరాలో దోపిడీ రూ.80 కోట్లకు పైమాటే. లీటరు రూ.137 చొప్పున సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకున్న అధికారులు.. ధర అధికంగా ఉన్నప్పుడు సరఫరా చేయకపోయినా పట్టించుకోలేదు. మార్కెట్లో పామాయిల్ ధర తగ్గాక సరఫరా చేసేందుకు అనుమతించారు. ఒక్కో లీటరుపై రూ.40 నుంచి రూ.60 వరకు లబ్ధి కల్పించేలా అధికారులు సహకరించడం విశేషం.
- ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గతేడాది గోధుమపిండి సరఫరా టెండర్లను క్వింటాల్‌కు రూ.660 చొప్పున అప్పగించారు. సరఫరా చేసిన గోధుమపిండి నాసిరకంగా ఉందని విచారణలో తేలినా పౌరసరఫరాల సంస్థ పట్టించుకోలేదు. రాయలసీమలో రాగిపిండి సరఫరాకు టెండర్లు పిలిచి మిల్లింగ్ పేరుతో అక్కడ నుంచి ఉత్తరాంధ్రకు రవాణా చేశారు. ఈ రూపంలో 5 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు అంచనా.
- గడప వద్దకే రేషన్ పంపిణీ పేరుతో మరో మోసానికి పాల్పడ్డారు. రూ.540 కోట్ల వ్యయంతో 9,260 ఎండీయూ వాహనాల్ని కొనుగోలు చేశారు. వీటి నిర్వహణకు ఏటా రూ.250 కోట్లు ఖర్చు కాగా, ఎన్ని పని చేస్తున్నాయో, ఎన్ని పని చేయడం లేదో లెక్కలూ లేవు. వందల వాహనాలు మూలన పడ్డా ప్రతినెలా అద్దెలు, జీతాలు మాత్రం చెల్లించడం గమనార్హం. కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ ఇవ్వక పోగా లబ్ధిదారులు తమ పనులు మానుకుని రేషన్‌బండి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిని కల్పించారు.
- సంచుల్లో బియ్యం ప్యాకింగ్ కోసం యంత్రాలు, సామగ్రికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. కొన్నాళ్లకే వాటిని పక్కన పడేసి ఎండీయూ వ్యవస్థ తీసుకువచ్చి గతేడాది ప్రైవేటుకు అప్పగించారు. దీంతో పెద్ద ఎత్తున చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది.
- వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో పౌరసరఫరాల సంస్థలో దోపిడీకి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తే ధాన్యం రవాణా, ఇతర అక్రమాలు అనేకం వెలుగుచూసే అవకాశాలు లేకపోలేదు.
కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది: మంత్రి నాదెండ్ల - Nadendla Manohar on Ration Rice
కాకినాడ కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యం- 51,427 మెట్రిక్ టన్నులు సీజ్ - ration rice exported