ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

చంద్రబాబు రాక చారిత్రక అవసరం!- ఏపీ ప్రజల తీర్పు ఏకపక్షం - AP Needs CBN

AP Needs CBN : పడకేసిన అభివృద్ధి, పొంచిన ఆర్థిక సంక్షోభం.. గాడి తప్పిన పాలన, విఫలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు.. రాజకీయాలతో అంటకాగిన అధికారులు.. ఏపీ భవిష్యత్​ ప్రమాదంలో పడిన నేపథ్యంలో ప్రభుత్వ మార్పు అనివార్యమని మేధావి వర్గం భావించింది. రాష్ట్రానికి చంద్రబాబు అవసరాన్ని యువతరం గుర్తించింది. సుపరిపాలన, సువర్ణాధ్యాయం దిశగా రైతు, మహిళా లోకం అడుగులు వేసి కూటమిని ఆదరించిన తీరు చారిత్రక పరిణామం.

ap_needs_cbn
ap_needs_cbn (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 5, 2024, 3:34 PM IST

AP Needs CBN : తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. హోరాహోరీ పోరు అనుకున్న ఎన్నికలు ఊహించని ఫలితాలు అందించాయి. యావత్​ ఆంధ్ర ప్రజానీకం ఏకపక్షంగా నిలిచిన తీరు విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రజల ఆశీస్సులతో చారిత్రక విజయాన్ని అందుకున్న కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఐదేళ్లుగా అన్ని వర్గాలు ఎదుర్కొన్న అణచివేత ఏపీలో విప్లవాత్మక మార్పు వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.

పడకేసిన అభివృద్ధి, పొంచిన ఆర్థిక సంక్షోభం

ఒక్క ఛాన్స్​తో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్​ రెడ్డి ప్రజల నమ్మకం కోల్పోయారు. పాలనలో విశ్వసనీయత లోపించింది. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం ప్రకృతి వనరులను కరగదీసింది. పచ్చని గుట్టలు, ఇసుక మేటలు వైఎస్సార్సీపీ నేతల ధనదాహానికి హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్​ జీవనాడి పోలవరం ఆగిపోయింది. అదిగో, ఇదిగో అంటూ ఐదేళ్లపాటు సాగదీస్తూ రైతాంగం ఆశలపై నీళ్లు చల్లింది. పల్లెలు తాగునీటికి అల్లాడిపోతున్నాయి. పట్టణాల్లోనూ గొంతెండుతున్న దుస్థితి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విషపూరిత జలాలు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన దైన్యం నెలకొంది. ఇక అభివృద్ధి పడకేసి ఆదాయం మందగించింది. ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారింది. రాష్ట్ర ఖజానా ఖాళీ కాగా సంవత్సరంలో 152 రోజులు ఓవర్​ డ్రాఫ్ట్​ అంటూ కాగ్​ ఇచ్చిన నివేదిక వాస్తవ పరిస్థితిని కళ్లకుగట్టింది. ఐదేళ్లలో తెచ్చిన అప్పులు రాష్ట్ర భవిష్యత్​కు ముప్పు తప్పదన్న ఆలోచన ప్రజలను మేల్కొల్పింది.

పసుపు దళానికి అతడే ఒకసైన్యం - రాజకీయచాణక్యంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రుడు - chandrababu naidu strong comeback

'ఇవాళ తప్పు చేసి రేపు తప్పించుకోగలరా' ..

పాలనా వ్యవస్థలో మూలస్తంభాలైన ఉద్యోగ, పోలీస్ వర్గాల్లో పలువురు అధికారులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన వారే అన్యాయం, అక్రమాలకు దన్నుగా నిలిచారు. ఏపీ సీఐడీ అధికారులు కోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించడం గమనార్హం. పర్చూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బెయిలు పిటిషన్‌ సందర్భంగా పోలీసులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల వైఖరి బాగోలేదని, చట్టాన్ని అతిక్రమిస్తున్నారని వ్యాఖ్యానించింది. ప్రజలు ఎన్నుకొన్న ఎంపీ, ఎమ్మెల్యేలే పోలీసులకు భయపడే పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటి అని సూటిగా ప్రశ్నించింది. ఎవరో ఓ ఉన్నతాధికారిపై చర్యలు తీసుకుంటే తప్ప చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని హైకోర్టు వ్యాఖ్యానించడం పోలీసుల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అద్దం పడుతోంది.

విఫలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు- 'రాజారెడ్డి రాజ్యాంగం'

పార్టీ కార్యాలయాలు, పత్రికా కార్యాలయాలపై దాడులు, వెనుకబడిన వర్గాలపై దాడులు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మితిమీరిపోయాయి. టీడీపీ ప్రధాన కార్యాలయంపై, గన్నవరంలో జరిగిన విధ్వంస కాండపై పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత పట్టాభి సహా పలువురు నాయకులను జైలుకు పంపించారు. దాడులకు పాల్పడిన వారిని అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రేక్షక పాత్ర పోషించారు. గన్నవరంలో వైఎస్సార్సీపీ మూకలు జరిపిన హింసాకాండపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'రాష్ట్రంలో పోలీసు శాఖను మూసేశారా? లేక వైఎస్సార్సీపీలో విలీనం చేశారా? అని ధ్వజమెత్తారు. అంబేద్కర్​ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారంటూ టీడీపీ నేతల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వ మార్పు అనివార్యమన్న మేధావి వర్గం

ఓ వైపు వనరుల విధ్వంసం, మరోవైపు అణచివేత, ఇంకో వైపు అవినీతి, అక్రమాలు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మేధావి వర్గం ఆలోచనలో పడింది. నమ్మి అధికారం కట్టబెడితే నట్టేట మునిగిపోతున్నామని గుర్తించింది. ఈ విధ్వంసం కొనసాగితే భావి తరాలకు ముప్పుతప్పదన్న విషయాన్ని గ్రహించింది. ప్రజా సంఘాలు, విపక్ష రాజకీయ నేతలు ఏకతాటిపైకి వచ్చాయి. చైతన్య సదస్సులు, అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశాయి. దళిత, మైనార్టీ, బీసీ, ఎమ్మార్పీఎస్ సంఘాల నాయకులతో పాటు విద్యావేత్తలు సదస్సుల్లో పాల్గొని తమ ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం రగిలించారు. జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లకుకట్టారు.

ఐటీ ఉద్యోగాలంటే హైదరాబాద్​, బెంగళూరేనా?!

ఏటా జాబ్​ క్యాలెండర్​ అంటూ ఆశించిన నిరుద్యోగ యువత మోసపోయింది. ఉద్యోగాలు, ఉపాధి లేక నీరసించింది. వాలంటీర్​ కొలువులు తప్ప ఉపాధి ఊసెత్తని ప్రభుత్వంపై ఆగ్రహం కట్టలు తెగింది. 'ఐటీ ఉద్యోగాలు అంటే బెంగళూరు, హైదరాబాద్​ వెళ్లాల్సిందేనా, మన దగ్గర ఉండవా?సార్​' అంటూ ఓ యువతి యువగళం సభలో నారా లోకేశ్​ను ఉద్దేశించి అడిగిన ప్రశ్న యువతరంలో గూడుకట్టుకున్న ఆవేదనను గుర్తు చేసింది. సంక్షేమం మాటున జరుగుతున్న దోపిడీని విద్యావంతులు గమనించారు. బటన్ నొక్కడం మాటున జరుగుతున్న కుంభకోణాల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వని పరిస్థితిపై అవకాశం కోసం ఎదురుచూశారు.

ఈ ఎన్నికలు భవిష్యత్​కు మలుపు..

2024 ఎన్నికలు ఏపీ చరిత్రలో కీలకంగా చెప్పుకోవచ్చు. సుపరిపాలన, సువర్ణాధ్యాయానికి మరో మలుపుగా భావించవచ్చు. ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను ప్రతిబింబించేలా ఓటర్లు తీర్పునిచ్చారు. తెలుగు తల్లికి పసుపు పారాణి దిద్దారా?! అన్నట్లు 135 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాలను కట్టబెట్టి తెలుగుదేశం పార్టీకి చారిత్రక విజయాన్ని అందించారు. కూటమిలో ప్రధాన భూమిక పోషించిన జనసేన పార్టీకి నూటికి నూరు మార్కులు అన్నట్లుగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపించారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలిపించారు. 8 అసెంబ్లీ, 3 లోక్​సభ స్థానాల్లో బీజేపీకి విజయం కట్టబెట్టారు.

ఏపీలో కూటమి సునామీ- 164 సీట్లతో విజయ దుందుభి - AP Election Result

రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు- సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది: చంద్రబాబు - Chandrababu Naidu on NDA Victory

ABOUT THE AUTHOR

...view details