Chandrababu Tweet on Prajagalam :కృష్ణా జిల్లాలో ప్రజాగళం సభ, రోడ్డు షోకు భారీ స్పందన లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పోటెత్తి జన ప్రభంజనాన్ని తలపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాకతో ఉత్సాహం ఉప్పొంగింది. ప్రజలు వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు, పవన్‌కు స్వాగతం పలికారు. పెడన బస్టాండ్ కూడలి, మచిలీపట్నం కోనేరు సెంటరు జనసంద్రంగా మారిపోయాయి. గతంలో ఒక్క అవకాశం అన్న జగన్‌ను నమ్మి ఓటేశామని, ఈ సారి మాత్రం వేసేది లేదు అంటూ పెడన, బందరు వాసులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
పెడనలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వేర్వేరుగా హెలీకాఫ్టర్లలో చంద్రబాబు, పవన్ చేరుకున్నారు. తొలుత చంద్రబాబు చేరుకోగా, ఆ తర్వాత పవన్ వచ్చారు. అక్కడి నుంచి వీరిద్దరూ కలిసి పెడన బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభ వద్దకు ఒకే వాహనంలో రోడ్‌షోగా వచ్చారు. దారి పొడుగునా ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివచ్చి ఇద్దరికీ స్వాగతం పలికారు. ఒకవైపు పవన్, మరోవైపు చంద్రబాబు వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ తరలివస్తుండడంతో మూడు పార్టీల అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయింది. ఇద్దరికీ జయ జయ ధ్వానాలు పలుకుతూ స్వాగతం పలికారు.
మద్య నిషేధం అన్నారు - సారా వ్యాపారం చేస్తున్నారు: పవన్ కల్యాణ్ - Pawan Kalyan Key Comments
బాబు, పవన్ రోడ్‌షోకు జనం నీరాజనాలు పలికారు. అడుగడుగునా పూలదండలు, స్వాగత తోరణాలతో నింపేశారు. క్రేన్‌లను తీసుకొచ్చి భారీ గజమాలలతో తమ అభిమానాన్ని చూపించారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి హారతులిస్తూ ఇద్దరికీ స్వాగతం పలికారు. పూలు జల్లుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టారు.