Chandrababu Selects Candidates for TDP 3rd List:తెలుగుదేశం ప్రకటించిన రెండు జాబితాల్లోనూ కొందరు సీనియర్ నేతలకు చోటు దక్కలేదు. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావును బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి నిలబెట్టాలని అధిష్టానం భావిస్తుండగా ఆయన మాత్రం భీమిలి నుంచే పోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. దీనిపై చంద్రబాబుతో రెండు సార్లు చర్చించారు. పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంట్ స్థానం మిత్రపక్షానికి కేటాయించాల్సి వస్తే భరత్‌కు భీమిలి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అందుకోసమే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే ఇప్పుడు బీజేపీకి విశాఖ ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో భరత్ విశాఖ నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినా గంటాకు భీమిలి టిక్కెట్ ఇవ్వకుండా అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది.
టీడీపీ రెండో జాబితా విడుదల - అభ్యర్థుల సంబరాలు - గెలుపుపై ధీమా
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుండటంతో పాటు మరో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తోంది. దీంతో ఆ స్థానాన్ని తొలి, మలి జాబితాల్లో ఖరారు చేయలేదు. కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కసరత్తు సాగుతోంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వరుసగా ఓటమి పాలవుతున్నారు. దీంతో ఆయన కోడలికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తోంది.
ఇటీవలే వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరం టిక్కెట్ కేకటాయించే అవకాశం ఉన్నా స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ సర్దుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో తుది జాబితాలో ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. అదే విధంగా గుంతకల్లులో గుమ్మనూరు జయరాం పేరు సైతం తుది జాబితాలో ప్రకటించనున్నారు. అలాగే త్వరలోనే తెలుగుదేశంలో చేరనున్న శిద్ధారాఘవరావుకు సైతం దర్శి సీటు కేటాయించే అవకాశం ఉన్నా పార్టీ క్యాడర్‌తో సర్దుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సీటు సైతం అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది.
మరో జాతీయ సర్వేలోనూ టీడీపీకే పట్టం - తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆధిక్యం
రాజంపేట నుంచి చెంగల్‌రాయుడు పేరును పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. అయితే మరికొంత మంది కూడా ఇక్కడ పోటీకి ఆసక్తి చూపిస్తుండటంతో సందిగ్ధత నెలకొంది పలాసలో గౌతు శిరీష రేసులో ఉన్నా మంత్రి సీదిరి అప్పలరాజును ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం పార్టీ అన్వేషిస్తోంది. పాతపట్నంలో కలమట వెంకటరమణమూర్తి, మావిడి గోవిందరావులు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి ఇవ్వాలనేది ఇంకా తేల్చలేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రవాసాంధ్రుడు గంప కృష్ణ, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలనేది క్లిష్టంగా మారింది.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
కాకినాడ సిటీ టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఇవ్వాలా? లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా బరిలో దింపాలా అనే కసరత్తు సాగుతోంది. చీరాలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారడంతో తదుపరి విడతలో ప్రకటించే అవకాశముంది. ఆలూరులో వీరభద్ర గౌడ్‌తో పాటు వైకుంఠం మల్లికార్జున, జ్యోతి మరి కొంతమంది పోటీ పడుతున్నారు. వివిధ సమీకరణాల రీత్యా ఇక్కడ ఎవరికి ఇవ్వాలనేదానిపై కసరత్తు కొనసాగుతోంది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.