Chandrababu Request to People for Blessing to TDP Candidates : తెలుగుదేశం అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కోరారు. తొలి జాబితాలో 94 మందిని ప్రకటించగా ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తీసుకొచ్చామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగుదేశం విడుదల చేసిన రెండో జాబితాలో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. వీరిలో పీహెచ్ డీ చేసిన వారు ఒక్కరు ఉండగా, పీజీ చేసిన వారు 11 మంది ఉన్నారు. 9 మంది గ్రాడ్యుయేట్లు (Graduates) కాగా ఎనిమిది మంది ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 10వ తరగతి చదివిన వాళ్లు ఏదుగురు అభ్యర్థులు ఉన్నారు.
ఆశావహులు, అసంతృప్తులతో చంద్రబాబు భేటీ - రాజకీయ భవిష్యత్తుకు హామీ
రెండో జాబితాలో 35 ఏళ్ల లోపు వారు ఇద్దరు ఉండగా, 36-45ఏళ్ల మధ్య వారు 8 మంది ఉన్నారు. 46-60 ఏళ్ల వయస్సు మధ్య వారు అత్యధికంగా 19మంది ఉన్నారు. 61-75ఏళ్ల మధ్య వారు ముగ్గురు, 75 ఏళ్లు పైబడిన వారు ఇద్దరున్నారు. రెండో జాబితాలో వారసులు, రాజకీయ కుటుంబ సభ్యులకు చోటు కల్పించారు. రెండో జాబితాలో రాజకీయ కుటుంబం నుంచి ఏడుగురికి అవకాశం లభించింది. ఏడుగురు రాజకీయ వారసులు తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు.
'ఎందుకు? ఏమిటి? ఎలా?' టీడీపీ సీనియర్లలో టెన్షన్ - బాబు నివాసం వద్ద హైడ్రామా
ప్రత్తిపాడు స్థానానికి దివంగత వరపుల రాజా భార్య సత్యప్రభకు, నెల్లూరు పార్లమెంట్ కోవూరుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (MP Vemireddy Prabhakar Reddy) భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం కల్పించారు. వెంకటగిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీ ప్రియ, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాల కృష్ణరెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేయనున్నారు. కమలాపురం స్థానానికి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్య రెడ్డికి చోటు కల్పించారు. పుట్టపర్తి స్థానం నుంచి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డి, కదిరికి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ భార్య యశోదా దేవికి అవకాశం కల్పించారు.