Chandrababu, Pawan Kalyan Speech After Announcing First List:జగన్ వల్ల ఏపీ బ్రాండ్ దెబ్బ తిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచకాలను సామాన్యుల మొదలకుని తానూ, పవన్ కల్యాణ్ చాలా వరకు భరించామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనేదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ప్రజా వేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైందని, అదే వరవడి చివరి వరకు కొనసాగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబితా కోసం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని, 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత చేశామని తెలిపారు.
టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఈ జాబితాలో యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, ఇందులో 23 మంది తొలిసారి పోటీ చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ తమ తొలిజాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. రాజమండ్రి రూరల్ సీటు విషయంలో తెలుగుదేశం - జనసేన ఆశావహులు ఇద్దరికీ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్ ఇద్దరిలో ఒకరు రాజమండ్రి రూరల్లో మరొకరు వేరే చోట పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. వైసీపీ తరుపున రౌడీలు, దోపిడీ దారులు, అభ్యర్థులుగా నిలబడ్డారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం, గంజాయి స్మగ్లర్లును వైసీపీ పోటీకి దింపుతోందని చంద్రబాబు అన్నారు.