Chandrababu Meeting with Amit Shah and JP Nadda:తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురూ సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. నడ్డా, షాలతో రాత్రి ఏడున్నరకు భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయేవరకూ పార్లమెంటు ఉభయసభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. దాంతో రాత్రి 11.25 గంటలకు చంద్రబాబు వారితో సమావేశం అయ్యారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే చంద్రబాబు కన్నా 10 నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు. తర్వాత చంద్రబాబు షా నివాసం నుంచి వెళ్లిపోయారు.
స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా?: చంద్రబాబు
బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు షా, నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమలనాథులు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అంతకుముందు దిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్‌కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి గల్లా ఇంటికి చేరుకుని పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు.