KTR Comments On Musi Renovation : పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండానే మూసీని ప్రక్షాళన చేయవచ్చని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన అంటూ వికారాబాద్ అడవుల్లో వనమేధం చేస్తున్నారని మండిపడ్డారు. అడవుల్లో 12 వేల చెట్లు నరికేస్తున్నారని ఆరోపించారు. ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో గృహమేధం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీపై మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
25 వేల కోట్లతో మూసీ ప్రక్షాళనం చేయొచ్చు :50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని గతంలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మాట మార్చి రూ.లక్షా యాభై వేల కోట్లతో సుందరీకరిస్తామని చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. తుదిదశలో ఎస్టీపీలు, సీవరేజ్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. కేవలం రూ.1100 కోట్లతో నల్గొండకు శుద్ధమైన నీరు ఇవ్వవచ్చన్నారు. 25 వేల కోట్లతో మూసీని ప్రక్షాళనం చేయవచ్చన్నారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన అంటూ అవినీతి చేస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
మూసీని మురికి కూపంలా మార్చారు :తెలంగాణకు ముందు ఉన్న ప్రభుత్వాలు మూసీని మురికి కూపంలా మార్చాయని కేటీఆర్ ఆరోపించారు. 31 ఎస్టీపీలు పూర్తయినట్లయితే మూసీలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుందన్నారు. గతంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ను ప్రారంభించినట్లుగా కేటీఆర్ గుర్తు చేశారు. రూ.1000 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టును ప్రారంభించినట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు. రూ.5 వేల కోట్లతో రెండో దశ ఎస్‌ఎన్‌డీపీని చేపట్టాలనుకున్నామన్న కేటీఆర్ మళ్లీ తమ ప్రభుత్వం వచ్చి ఉంటే రెండో దశ ఎస్‌ఎన్‌డీపీని ప్రారంభించేవాళ్లమని తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీని ప్రారంభించడం వల్లే ప్రస్తుతం మురికినీటి నిల్వ ఉండట్లేదని వివరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండో దశ ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టును రద్దు చేసిందని విమర్శించారు. రూ.540 కోట్లతో మూసీపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. రూ.3800 కోట్లతో డ్రైనేజీ సీవరేజ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించామన్నారు.