BRS Rajaiah Fires On Kadiyam :కాంగ్రెస్ నేత కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను నిండా ముంచడానికే కడియం శ్రీహరి ఆ పార్టీలో చేరారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. హనుమకొండలో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు : ఈ సందర్భంగా మాట్లాడిన తాటికొండరాజయ్య రాజకీయాల్లో కడియంను మించిన కుట్రదారులు ఉండరన్నారు. ఆయన తన స్వార్థంకోసం దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఆరోపించారు. శ్రీహరికి నీతి నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో ప్రజాక్షేత్రంలో పోటీపడాలంటూ సవాల్ చేశారు. టీడీపీ హయాంలో ఘన్‌పూర్ టికెట్‌ను తిరస్కరించి కడియంను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని ఇప్పుడు తనను రాజకీయంగా భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్న రాజయ్య ఉపఎన్నికల్లో కడియంను ఓడిస్తే ప్రజలంతా పూలదండలతో స్వాగతం పలికారని గుర్తు చేశారు. రాజకీయ బిక్షపెట్టిన ఎన్టీఆర్‌ను కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర కడియం శ్రీహరికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆ ఒప్పందాన్ని బద్దలు కొడతామని ఉద్ఘాటించారు.