BRS Leader KTR to Start Padayatra in Telangana :బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఎక్స్‌లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్‌లో కొంత మంది పాదయాత్రపై ఆయన అభిప్రాయాన్ని కోరారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీలను బలోపేతం చేసేందుకు దేశంలోని అనేక పార్టీల నేతలు, పార్టీ అధ్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారని, మీరెప్పుడు చేస్తారని కేటీఆర్‌ను అడిగారు. వాటికి స్పందించిన కేటీఆర్ కచ్చితంగా పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. పాదయాత్ర చేయాలని అందరూ కోరుతున్నారని, ఆ దిశగా తనను సంసిద్ధుణ్ని చేసుకోనివ్వండని ఆయన తెలిపారు.
KTR Fire on Congress Government :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. పంట కొనుగోళ్లు, అకాల వర్షాలకు ధాన్యం తడవడంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. వానాకాలం వరి కోతలు సాగుతున్నప్పటికీ, రైతుబంధు, రైతు భరోసా ఊసే లేదని ఆక్షేపించారు. కనీసం పంట కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయిందని కేటీఆర్ పేర్కొన్నారు.