Harish Rao Tweet On Law And Order : రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత పదేళ్లలో శాంతిభద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో భద్రత ప్రశ్నార్థకమవ్వటం బాధాకరమన్నారు. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్‌లో అందరూ చూస్తుండగానే సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుందని మండిపడ్డారు. నిన్నటి రోజున భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీసే తోటి మహిళా కానిస్టేబుల్‌ను భక్షించే దుర్ఘటన జరగడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.
భూపాలపల్లి జిల్లా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాలని కోరుతున్నట్లు 'ఎక్స్' వేదికగా హరీశ్‌రావు కోరారు.