Harish Rao Fires On Congress at Meet The Press Program :ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఆరింటిలో ఐదు అమలుచేశామన్నారని, అంతా అబద్ధమని విమర్శించారు. గృహజ్యోతి కింద మీరు ఇచ్చింది 30 లక్షల మందికే అని అన్నారు. రైతులు, మహిళలు, పేదలను, యువత, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎందుకు ఓటేశామా అని జనం బాధపడుతున్నారు : రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని హరీశ్‌రావు ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. జనవరిలో ఆసరా పింఛన్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.4,000లు ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీలో భట్టి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామా అని జనం బాధపడుతున్నారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
"కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బౌన్స్ అయినందుకు కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో శిక్షించాలి. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలుచేస్తామని మోసం చేశారు. రైతుబంధు తనకు రాలేదని మంత్రి తుమ్మలే అన్నారు. దిల్లీకి మూటలు పంపడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంది. రేవంత్‌రెడ్డి మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ పరువు తీస్తున్నాయి. రేవంత్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి