BRS Reaction on Student Leaders Arrest At TGPSC Office :ఉద్యోగాలు, పోస్టులు భర్తీ చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల శాంతియుత నిరసనను నియంతృత్వంతో అడ్డుకొని అరెస్టు చేశారని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. అరెస్ట్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలపాలనుకున్న వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులతో రాహుల్ గాంధీ ములాఖత్‌లు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్యలపై అనేక నిరసన కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేవలం ఎన్నికల ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు నిరుద్యోగులను వాడుకొని నేడు వారి న్యాయపరమైన డిమాండ్లపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజాపాలన పేరును పదేపదే వల్లే వేసే కాంగ్రెస్ సర్కార్ జమానాలో యువకులు, విద్యార్థులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వ పోకడ చూపిస్తోందని మండిపడ్డారు.
"కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ తేదీల గడవు ఇప్పటికే అయిపోయింది. వెంటనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు, నిరుద్యోగులు, విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలి."- కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు