BJP Leader Purandeswari Fires On CM Jagan :రాష్ట్రంలో సాగుతోన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాక్షస పాలనలో ప్రజలంతా ఈ ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికల ముంగిట వేదికపైకి ఎక్కి నా బీసీ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బీసీ అనేది సీఎం జగన్ రెడ్డి పెదాలపై తప్ప ఆయన గుండెల్లో లేదని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పురందేశ్వరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పరిపాలన తీరుపై ప్రసంగిస్తూ నిప్పు చెరిగారు.
ప్రతి ఒక్కరిపై రెండు లక్షల రూపాయల అప్పు ఉంది : బీసీలపై కనీస సానుభూతి లేని ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కొనసాగడం అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అధోగతి చేసిన పాలన జగన్ రెడ్డిది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రెండు లక్షల రూపాయల అప్పు భారం ఉందని అన్నారు. ఇవి చాలవన్నట్లుగా సచివాలయం, రాష్ట్రంలో గనులు కూడా తనఖా పెడుతున్నారని గుర్తు చేశారు. అదేమిటంటే ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా? అని ఆ పార్టీ నాయకుడు వ్యంగ్య భాణాలు సంధిస్తున్నారని తెలిపారు. సుపరిపాలన అందిస్తారని ప్రజలు అధికారం అప్పగిస్తే, అడ్డగోలుగా దోచుకుని ప్రభుత్వం ఆస్తులు తనఖా పెట్టమని కాదన్నారు.