BJP Exercise on Selection of Candidates:రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. పార్టీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు విజయవాడ, గుంటూరు, బాపట్ల జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్న వారి జాబితాలను పార్టీ నాయకత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. వీటిని వడపోసి, ప్రాధాన్య క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసింది. వీటి ఆధారంగా జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జులతో నేతలు నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాల గురించి సమాలోచనలు జరిపారు.
వైసీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది: పురందేశ్వరి
రానున్న ఎన్నికల్లో ఏయే లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి? అభ్యర్థులు ఎవరెవరు అన్నదానిపై ఇప్పటికే పార్టీ నాయకత్వం ప్రాథమిక స్థాయిలో కసరత్తు చేసింది. పొత్తు ఉంటే ఎలా, ఒంటరిగా పోటీ చేయాలంటే అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలన్న దానిపై విడివిడిగా జాబితాలు సిద్ధం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కిరణ్కుమార్ రెడ్డి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఇతర నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త నల్లగట్ల రెడ్డప్ప పురందేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా - మంత్రి ధర్మాన వ్యాఖ్యలు : పురందేశ్వరి
అన్ని స్థానాల్లో పోటీకి సమాయత్తం:పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ '175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీకి పార్టీని సమాయత్తం చేసేలా ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని రానున్న ఎన్నికల ద్వారా పార్టీకి గతంలో కంటే 10% ఓటింగ్ పెరిగేలా చేస్తాం అని చెప్పారు. పార్టీ సీనియర్ నేత సీఎం రమేశ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులు ఉండాలా వద్దా అన్న అంశంపై శివ ప్రకాష్ అభిప్రాయాలు సేకరించారని తెలిపారు. పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
దేశ భవిష్యత్ యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది: పురంధేశ్వరి
జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయినా కడప ఎంపీగా అయినా పోటీకైనా సిద్ధమే సిద్ధమని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయిస్తే కడప ఎంపీ లేదా ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమే. పొత్తుంటే జమ్మలమడుగు సీటు బీజేపీకి వస్తుందా లేదా అనేది కూడా పార్టీయే నిర్ణయిస్తుంది. టీడీపీ- జనసేన పార్టీలు అభ్యర్థులను ప్రకటించని స్థానాలు చాలా ఉన్నాయి. పొత్తులతో లేదా ఒంటరిగా ఎలా పోటీ చేసేందుకైనా పార్టీ సిద్ధంగా ఉంది. పొత్తును ప్రజలు కోరుకుంటున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాం. అప్పుడు విశాఖ నార్త్ నుంచి గెలిచానని అన్నారు. ఈ సారి అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే అధిష్ఠానానిదే తుది నిర్ణయమని తెలిపారు.
అన్ని స్థానాల్లో పోటీకి బీజేపీ సమాయత్తం