Jawahar Reddy on Door to Door Pension Distribution : పింఛన్ల పంపిణీపై ఈటీవీ, ఈనాడు కథనాలు సంచలనంగా మారాయి. ఈ విషయమై సోమవారం సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగ్గా ఇంటింటికీ పింఛన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మెజారిటీ కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దనే పింఛను అందించాలనే నిర్ణయానికి మొగ్గుచూపారు. కానీ మురళీధర్‌రెడ్డి (Serp CEO Muralidhar Reddy) ఒక్కరే అది సాధ్యపడదని చెప్పినట్లు తెలిసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతోగానీ, ఆ శాఖ నిర్ణయాలతోనూ ఆయనకు సంబంధం ఉండదు. కేవలం పింఛన్ల నిధులు సమీకరించి విడుదల చేయడం, పంపిణీ తీరును పర్యవేక్షించడమే సెర్ప్ పరిధి. కానీ దానికి భిన్నంగా మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక ఉన్నతాధికారి చెప్పినట్టల్లా తలాడిస్తూ వైఎస్సార్సీపీకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మురళీధర్‌రెడ్డి వింత వాదన :సచివాలయ ఉద్యోగులు ఉండేది కేవలం పింఛన్ల పంపిణీ కోసమే కాదు. వారికి ఇతర పనులు కూడా ఉంటాయి, వారు ఇంటింటికీ వెళ్లి పింఛను ఇచ్చేందుకు మ్యాపింగ్ వంటి సమస్యలు వస్తాయంటూ మురళీధర్‌రెడ్డి వింత వాదన తెరపైకి తెచ్చారు. ఎన్నికల సమయంలో నగదు పంపిణీ పథకాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా లేదు. ఇది తెలిసీ ఇతర పనులున్నాయనేలా బుకాయించడం మురళీధర్‌రెడ్డి ఉద్దేశాన్ని చాటుతోంది. ఇక వాలంటీర్ల క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేయడం మహా అంటే రెండు మూడు గంటల పని. మ్యాపింగ్ సమస్యలున్నా అది గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చూసుకుంటుంది. ఆ శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్నట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే మురళీధర్‌రెడ్డి ఏ స్థాయిలో వైఎస్సార్సీపీకు వంత పాడేందుకు కంకణం కట్టుకున్నారో ఇట్టే అర్థమవుతోంది.
జగన్ భజన చేయించేందుకు ఇంటింటికీ పంపలేదా? :సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లడం ఇప్పుడే కొత్త అన్నట్టు వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మురళీధర్‌రెడ్డి హంగామా చేస్తున్నారు. కులగణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపి ప్రతి కుటుంబం సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మరిచిపోయారా? అంతపెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా?అంతకంటే పింఛన్ల పంపిణీ పెద్ద పనా? బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపలేదు? ఆ ఉద్యోగులతో జగన్ భజన చేయించేందుకు ఇంటింటికీ పంపలేదా? వీటన్నింటికీ లేని ఇబ్బంది ఏ ఆదరువూ లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను ఇవ్వడంలోనే వచ్చిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.