AP Cabinet Meeting Chaired by CM Chandrababu:సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు గుర్తించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణల పైనే ఉన్నట్టు తెలిసింది.
పలు జీవోల రద్దుపై చర్చ: ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలకు ఇబ్బందులు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982ను రద్దు చేయాలని నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై మంత్రి వర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77ను కూడా మంత్రి వర్గం రద్దు చేయనుంది.