Pratidwani :షెడ్యుల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించ అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. 20 ఏళ్లుగా నలుగుతున్న వ్యాజ్యానికి ఓ ముగింపునిస్తూ వర్గీకరణకు మార్గం సుగమం చేసింది సుప్రీం కోర్టు. సామాజిక స్థితిగతుల ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా ఎంతో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టం చేసింది CJI నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం. ఆ విషయంలో 2004లో అయిదుగురు సభ్యుల ధర్మానం ఇచ్చిన తీర్పునూ పక్కన పెడుతూ 6:1 మెజార్టీతో విస్పష్ట నిర్ణయం వెలువరించింది సుప్రీం. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల విధానంపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? సుప్రీం తీర్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న కర్తవ్యమేంటి? ఇదే అంశం పై నేటి ప్రతిధ్వని. చర్చలో దళిత, బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, ఎస్సీకార్పొరేషన్ మాజీ ఛైర్మన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు ఆర్‌డీ విల్సన్ పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు - రిజర్వేషన్ల విధానంపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? - Supreme Court Allows Categorization - SUPREME COURT ALLOWS CATEGORIZATION
Pratidwani : షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల కోటాలో వాటాల గురించి సుప్రీం వెలువరించిన తాజా తీర్పు ప్రాధాన్యత ఏమిటి? ప్రస్తుత విధానంలో ఇది ఎలాంటి మార్పులను తీసుకుని రానుంది? ఎంతోకాలంగా దళితబహుజన ఉద్యమ నాయకుడిగా ఉన్న వారు ప్రస్తుత సుప్రీం తీర్పుని ఎలా విశ్లేషిస్తున్నారు ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండొచ్చని అనుకుంటున్నారనే పలు అంశాలు నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 9:45 AM IST
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని గురువారం కీలక తీర్పునిచ్చింది. ఉపవర్గీకరణకు సంబంధించి 2004లో సుప్రీంకోర్టు 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చిచెప్పింది. అయితే, ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు- అందుకు సహేతుక కారణాలు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే విభేదించగా మిగిలిన ఆరుగురు ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపిన విషయం తెలిసిందే. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసులో 6 తీర్పులను విడివిడిగా ఇచ్చారు.