Pratidwani: ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికిస్తోంది. మంకీపాక్స్ (Mpox) రూపంలో దేశాలకు దేశాలకే కంటిపై కునుకు లేకుండా చేస్తోంది కొత్త ఉపద్రవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజమంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆఫ్రికాలో మొదలైన ఈ మహమ్మారి ఐరోపా దేశాలకు సైతం చేరింది. ఇప్పుడు ఈ మంకీపాక్స్ (Mpox) భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు కూడా చేరింది.
లక్షలమంది ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి పీడ పోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ ఏంటీ మంకీ పాక్స్ కలకలం? ఈ ముసలం ఎక్కడ మొదలైంది? ఆఫ్రికాలో శరవేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్ భారతదేశానికి కూడా పాకే ప్రమాదం ఉందా? అసలు మంకీ పాక్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తి చెందుతుంది? నివారణ మార్గాలు, వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం. దీనిపై చర్చించేందుకు ప్రజారోగ్య రంగ నిపుణులు డా. బి. రంగారెడ్డి, క్లినికల్ మైక్రోబయాలజీ నిపుణురాలు డా. శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొదట్లో ఎప్పుడు గుర్తించారంటే:ఈ వ్యాధిని 1958లో మొదటగా గుర్తించగా, 1970లో ఓ మనిషికి ఇది సోకింది. తొలుత ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు మంకీపాక్స్‌ను నిర్లక్ష్యం చేశాయి. అనంతరం 2022లో భారీస్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టాయి. గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే, గత 2 సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఏదోఒక మూల అంటువ్యాధి వచ్చిందని ఇతర దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని మంకీపాక్స్ వ్యాప్తి చెబుతోంది.
ఆందోళన దేనికి?:మంకీపాక్స్‌లో క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్) అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో క్లాడ్-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండగా, క్లాడ్-2 తక్కువ ప్రమాదకరం. క్లాడ్-1 కారణంగా న్యూమోనియా, బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు సైతం వస్తాయి. మరణాల రేటు కూడా 1 నుంచి 10 శాతం వరకు ఉంది. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు వస్తాయి. క్లాడ్-1 ఐబీ వేరియంట్ వేగంగా వ్యాపించం ఆందోళన కలిగిస్తోంది. లైంగిక సంబంధాల కారణంగా ఇది వేగంగా వ్యాపిస్తుంది.