Kangana Ranaut Loksabha Elections : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగిన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఆమెకు కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయి. రాజవంశీయులకు కంచుకోటైన మండిలో వారి నుంచే కాకుండా బీజేపీ అసమ్మతివాదుల నుంచి కూడా కంగనాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కంగనాకు బీజేపీ అధిష్ఠానం ఈ హై ప్రొఫైల్ నియోజకవర్గాన్ని కేటాయించింది.
మండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 8 ఉన్నాయి. మండి లోక్‌సభ నియోజకవర్గానికి రెండు ఉప ఎన్నికలు సహా మొత్తం 19 సార్లు ఎన్నికలు జరగ్గా వాటిలో13 సార్లు రాజవంశీయులే విజయం సాధించారు. కపుర్తలా రాజవంశానికి చెందిన రాజ్ కుమై అమృత్ కౌర్, మండి రాజవంశానికి చెందిన రాజా జోగిందర్ సేన్ బహదూర్ ఒక్కోసారి ఇక్కడ నుంచి గెలిచారు. సుకేత్‌కు చెందిన రాజా లలిత్ సేన్ రెండుసార్లు, మాజీ సీఎం వీరభద్ర సింగ్, ఆమె భార్య ప్రతిభా సింగ్ మూడేసిసార్లు, రాజా మహేశ్వర్ సింగ్ మూడుసార్లు మండి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.
కంగనా రనౌత్‌కు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి ప్రతిభా సింగ్ ఉన్నారు. బుషార్ రాజ కుటుంబానికి చెందిన ప్రతిభా సింగ్ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీ. ఆరుసార్లు హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా పని చేసిన వీరభద్ర సింగ్ భార్య ఆమె. హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాధిత్య సింగ్‌కు తల్లి. ఇప్పటికే మూడుసార్లు ఆమె మండి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మండి నుంచి తాను పోటీ చేయడం లేదని చెప్పిన ప్రతిభా సింగ్, బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసిన వెంటనే తన వైఖరిని మార్చుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను అనుసరించి మండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.
ఇక రాజవంశాలకు చెందని వారు కూడా మండి నుంచి కొన్నిసార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మాజీమంత్రి సుఖ్‌రామ్ 3 సార్లు, రామ్‌స్వరూప్ 2 సార్లు, గంగాసింగ్ ఒకసారి ఇక్కడ నుంచి నెగ్గారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండి నుంచి బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ గెలుపొందారు. ఆయన మరణించిన తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికలో స్వల్ప మెజార్టీతో ప్రతిభా సింగ్ విజయం సాధించారు.
సొంత పార్టీలోనే కంగనా అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కులు రాజవంశస్థుడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజా మహేశ్వర్ సింగ్, కంగనరనౌత్ అభ్యర్థిత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండి నుంచి గతంలో 3 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన, కంగనాకు టికెట్ కేటాయించడాన్ని పునసమీక్షించాలని బీజేపీ అగ్రనాయకత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు. పార్టీకి ఆమె ఎలాంటి సేవ చేయలేదని వివరించారు. తనకే టికెట్ ఇస్తామని గతంలో పార్టీ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మండి ప్రజలూ కంగనా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుపుతున్నారని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు మహేశ్వర్‌సింగ్ తెలిపారు.