Prathidwani :తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకు ఒక మంచిమార్గం ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు. ఆ ఆశే ఇప్పుడు ముంచేస్తోంది. ఎఫ్అండ్ఓ విభాగంలో లక్షల సంఖ్యలో పెరుగుతున్న రిటైల్ మదుపర్లు ఊహించని రీతిలో చితికి పోతున్నారు. మూడేళ్లలో వారు నష్ట పోయిన మొత్తం అక్షరాల 1.8 లక్షల కోట్ల రూపాయలు. 2023-24లోనే హరించుకుపోయిన చిన్నమదుపర్ల డబ్బులు 75వేల కోట్ల రూపాయలు. ఇందులోనూ 30ఏళ్ల లోపు వారే అధికం అంటోంది సెబీ. కానీ ఎందుకీ పరిస్థితి? ఎఫ్అండ్ఓ లతో పాటు మొత్తం స్టాక్మార్కెట్లో చిన్న ఇన్వెస్టర్లు ఎంతవరకు సేఫ్? స్టాక్స్‌లో మదుపు చేయడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలేంటి? రిస్క్ లేని రిటర్న్స్ కోసం నిపుణులు ఏం సూచిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ వీవీకే ప్రసాద్, వెల్త్ ట్రీ గ్రూప్ ఫౌండర్ సీఈవో దాసరి ప్రసాద్ పాల్గొన్నారు.
ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ట్రేడింగ్ (F&O Trading) చేసిన వారు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారని తెలిసినా పెట్టుబడులు మాత్రం ఆగడం లేదు. తక్కువ సమయంలో లాభాలను పొందొచ్చనే ఆశతో ఈ ట్రేడింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టిన వారిలో 91 శాతం మంది అంటే సుమారు 73 లక్షల మంది వ్యక్తిగత పెట్టుబడిదారులు నష్టాలు చవిచూసినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తెలిపింది. అంటే ప్రతి 10 మందిలో 9 మందికి నష్టాలు ఎదురవుతున్నట్లు తన అధ్యయనంలో వెల్లడించింది. వీరు సగటున రూ.1.2 లక్షలు చొప్పున నష్టం ఎదుర్కొన్నట్లు తెలిపింది.