Pratidhwani :తెలుగుదేశం - జనసేన కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితా విడుదలైంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంలో పేచీ వస్తుందని, పొత్తు నీరుకారుతుందని భావించిన అధికార వైఎస్సార్సీపీకి చుక్కెదురైంది. విపక్షాలు చేతులు కలపకుండా చేయాలని తెరముందు, తెరవెనుక అధికార పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. ఓట్ల చీలికతో లాభపడవచ్చన్న ఆశలు గల్లంతయ్యాయి. టీడీపీ - జనసేన కలయికపై వైఎస్సార్సీపీ ఎందుకు కలవరంతో ఉంది? విపక్ష కూటమి ఏ విధంగా దీనివల్ల బలోపేతం అవుతోంది? ఇది వైఎస్సార్సీపీకి ఏ విధంగా నష్టం కలిగిస్తుంది? 'కలిసిన విపక్షం - కలవరంలో అధికారపక్షం' అనే అంశంపై ప్రతిధ్వని చర్చ. రాజకీయ విశ్లేషకులు కె.గౌతమ్, సీనియర్ జర్నలిస్ట్ పి.విక్రమ్ చర్చలో పాల్గొన్నారు.
TDP-Janasena First List for AP Elections-2024 : తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల జాబితాలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. 99 మంది అభ్యర్థుల్లో 18మంది బీసీలు ఉన్నారు. ఇఛ్చాపురం, టెక్కలి, అమదాలవలస, గజపతినగరం, విశాఖ పశ్చిమం, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం సిటీ, ఆచంట, నూజివీడు,పెడన, మచిలీపట్నం, రేపల్లె, మైదుకూరు, పత్తికొండ, రాయదుర్గం,పెనుకొండ, అనకాపల్లి స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు 17 మందికాగా జనసేన నుంచి మాజీ మంత్రి కొణతల రామకృష్ణ ఉన్నారు.
వెనకబడిన వర్గాలకే టీడీపీ-జనసేన తొలి జాబితాలో పెద్దపీట
రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలుండగా తొలి జాబితాలోనే 20 మందిని ప్రకటించారు. ఆ 20 మంది తెలుగుదేశం పార్టీ వారే. వీరిలో 10మంది మొదటి సారి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. వారిలో పి.గన్నవరం నుంచి మహాసేన రాజేష్, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు సామాజిక కార్యకర్తలు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో పోరాడుతున్నారు.