Ram Temple impact On Elections 2024 : భక్తుల శతాబ్దాల కల అయిన అయోధ్యలోని శ్రీరాముని భవ్యమందిర నిర్మాణం సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని దశాబ్దాలుగా బీజేపీ వాగ్దానం చేస్తూనే ఉంది. నాడు అడ్వాణీ రథయాత్ర మొదలుకొని జరిగిన పరిణామాల్లో ఎప్పుడూ బీజేపీ రామ మందిర నిర్మాణంపై వెనక్కి తగ్గిందిలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన నుంచి బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వరకు ప్రధాని మోదీ చేతుల మీదుగానే సాఫీగా సాగిపోయింది. ఈ నేపథ్యంలో హిందువులతో పాటు తటస్థుల ఓట్లను రామాలయ నిర్మాణం తమకు తెచ్చిపెడుతుందని బీజేపీ ధీమాగా ఉంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి విపక్షాలు దూరంగా ఉండడం కూడా కమలదళానికి లాభమే చేకూర్చతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మతపరమైన రాజకీయలకు తెర
సువిశాల భారత దేశం స్వాతంత్ర్య కాలం నుంచి సెక్యులర్ విధానాలనే అనుసరిస్తూ వస్తున్నప్పటికీ దేశంలో ఉన్నది మెజార్టీ ప్రజలు హిందువులే. దేశంలో కులపరమైన రాజకీయం ప్రభావం చూపుతున్నప్పటికీ 1980 దశకం నుంచి మతపరమైన రాజకీయం ప్రాముఖ్యం సంతరించుకుంది. అందుకు తెరతీసింది భారతీయ జనతా పార్టీనే. అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయ నిర్మాణం కోసం తొలి నుంచి ఉద్యమించింది కమలదళమే. ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కల్యాణ్ సింగ్, వినయ్ కటియార్, ప్రవీణ్ తొగాడియా, మోహన్ భగవత్ ఇలా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం నినదించారు. వీరంతా బీజేపీ లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్‌కు చెందినవారే. 2019 నవంబర్ 9న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీర్పునకు వ్యతిరేకంగా దేశంలో ఎలాంటి అల్లర్లు, వ్యతిరేకత వ్యక్తంకాలేదు. వెంటనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రామాలయ నిర్మాణం కోసం శ్రీరామమందిర తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేసింది. ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణం ప్రారంభించింది. మసీదు కోసం వేరే చోట స్థలం కేటాయింపునకు చొరవ తీసుకుంది.
ఎన్నికల కోసమే హడావుడిగా ప్రాణ ప్రతిష్ఠ
500 ఏళ్లుగా అయోధ్యలో రామమందిర నిర్మాణం కలగా మిగిలిన పరిస్థితుల్లో వేగంగా ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 2024 జనవరి 22న ప్రధాని మోదీ బాల రాముడి ప్రాణప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయితే, సార్వత్రిక ఎన్నికలు ఉన్నందునే ప్రధాని మోదీ హడావుడిగా ప్రాణప్రతిష్ఠ నిర్వహించారని విపక్షాలు ఆరోపించాయి. ఆ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పటికీ దూరంగా ఉండిపోయాయి. ప్రాణప్రతిష్ఠను బీజేపీ, ఆరెస్సెస్ దేశమంతా పండగలా నిర్వహించాయి. ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేశాయి. కలశ యాత్రలు, ర్యాలీలు నిర్వహించాయి. ప్రజలకు రామచరిత మానస్ పుస్తకాలు, పేదలకు బట్టలు పంపిణీ చేశాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజన దేశమంతా వివిధ ఆలయాల్లో ఎల్‌ఈడీ తెరలపై కార్యక్రమాన్ని బీజేపీ వర్గాలు ఏర్పాటు చేశాయి. తద్వారా రామాలయ నిర్మాణ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు కమలదళం ప్రయత్నించిందని విపక్షాలు విమర్శించాయి. ఆ విమర్శలను పట్టించుకోని కాషాయ పార్టీ విపక్షాలపైనే ఎదురుదాడికి దిగింది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం తర్వాత రోజు నుంచి వేలాది మంది భక్తులు అయోధ్యను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం బీజేపీకే లబ్ది చేకూర్చుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.