JNTUH Engineering Colleges In Sangareddy: కోటి చదువులు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఎంత చదివినా ఎన్ని డిగ్రీలు చేతికి వచ్చినా ఉద్యోగం సాధించకుంటే వృధా. ఉద్యోగం కోసమే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. దీనికోసం సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రాంగణ నియామకాలతో కళాశాలలో చేరిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యేనాటికి ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇస్తుంది.
కొలువుల ప్రాంగణం :ఈ కళాశాలను 2012లో ప్రారంభించారు. ఈ కళాశాలలో ఈసీఈ, సీఎస్‌ఈ, ఎంఈసీహెచ్, సివిల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తృతీయ సంవత్సరం చదువుతున్న వారిలో ఎక్కువ మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికకావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ కళాశాలలో ప్రస్తుతం 1,594 మంది చదువుతున్నారు.
మూడేళ్లలో 693 మందికి ఉద్యోగాలు : గత మూడు సంవత్సరాల్లో ఈ కళాశాల నుంచి 693 మంది ఉద్యోగాలు పొందారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బ్యాంకింగ్ రంగాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. జేఎన్టీయూ కళాశాల విద్యార్థులకు అధ్యాపకులు బోధనతో పాటు ఉద్యోగ సాధన దిశగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కళాశాలలో ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కంపెనీలు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఉద్యోగాలు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. చివరి సంవత్సరం విద్యార్థులందరూ ప్రాంగణ నియామకాల్లో పాల్గొనేలా వారికి శిక్షణ ఇస్తున్నారు. తరచూ రాత పరీక్షలు, ఉపన్యాస పోటీలు, నమూనా ముఖాముఖీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు.