International Film Award to Sedyam Movie Made by Dharmavaram Youth:చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరి ఆలోచన ఒక్కటే. సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటాలి. ఒకరు దర్శకత్వం వైపు అడుగులేస్తే మరొకరు సినిమాటోగ్రఫీలో అనుభవం సంపాదించారు. లఘుచిత్రాలతో సినీ ప్రయాణం మొదలుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా సాగారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రత్యక్ష అనుభవాలతో 'సేద్యం' చిత్రం రూపొందించి 6 అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చంద్రకాంత్, విష్ణువర్ధన్‌రెడ్డిలు చిన్ననాటి నుంచే స్నేహితులు. ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇద్దరూ కలిసి తరచూ సినిమాల గురించే మాట్లాడుకునేవారు. పెద్దయ్యాక ఆసక్తి మరింత పెరిగింది. సీఏ చదువు ఆపేసి మరీ దర్శకత్వం పైన దృష్టి పెట్టాడు చంద్రకాంత్. విష్ణువర్దన్ రెడ్డి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఫిల్మ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో చేరాడు. ఇద్దరూ ఏడాదిలోపే తాము ఎంచుకున్న రంగాల్లో పట్టు సాధించారు.
2016లో తొలిసారి 'నా ఊపిరి' అనే లఘు చిత్రం రూపొందించారు ఈ స్నేహితులు. ఇప్పటి వరకు 11 షార్ట్‌ఫిల్మ్‌లు, పూర్తిస్థాయిలో 'సేద్యం' సినిమా చిత్రీకరించారు. ఉద్యోగం, మంచి జీతం కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు పడే అగచాట్లపై వీరు తీసిన 'గల్ఫ్‌గోస'కు అనేక అంతర్జాతీయ, రాష్ట్ర అవార్డులు వచ్చాయని చెబుతున్నాడు చంద్రకాంత్.
'ఇంటర్ అయిపోయినప్పటి నుంచి కెరీర్ ప్రారంభించాను. ఫిల్మ్ మేకింగ్ చేస్తూనే డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశాను. మా నాన్న చిన్నప్పటి నుంచి ఎక్కువ సినిమాలు చూపించేవారు. అప్పటి నుంచే నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అప్పుడే డైరెక్టర్ అవ్వాలనుకున్నా, వయసు పెరుగుతుంటే ఆసక్తి పెరిగింది. షార్ట్పిల్మ్లు చేశాను. సామాజిక సమస్యలు సహా కమర్షియల్ సినిమాలు తీశాను. వివిధ వేదికలపై నా సినిమాలకు అవార్డులు రావడం నాకెెంతో స్ఫూర్తినిస్తాయి.'-పసుపులేటి చంద్రకాంత్, సేద్యం దర్శకుడు