Who Is Anura Kumara Dissanayake : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంకలో ఉత్కంఠభరితంగా సాగిన త్రిముఖ పోరులో, చివరకు మార్క్సిస్టు నేత అనుర కుమార దిసనాయకే ఘనవిజయం సాధించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు, మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గు చూపే దిసనాయకేను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన, ఈసారి జరిగిన ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకొని 42.31% ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు.
రాజకీయ ప్రస్థానం
1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ)లో చేరిన దిసనాయకే, అక్కడే తన రాజకీయ పునాదిని నిర్మించుకున్నారు. 1998 నాటికి పొలిట్‌బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000లో ఎంపీ అయిన దిసనాయకే, 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్‌పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగానూ ఆయన సేవలందించారు.
ప్రజానాడిని పసిగట్టి
శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలచుకొని దిసనాయకే సమర శంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతిని, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం, రాజపక్స రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను, అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకోవడంలో దిసనాయకే సఫలీకృతమయ్యారు.
విద్యార్థి రాజకీయాల నుంచి
విద్యార్థి నేతగా మొదలుపెట్టి, దేశాధినేత వరకు ఎదిగిన దిసనాయకే, శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబరు 24న కొలంబోనకు 100 కి.మీల దూరంలో ఉన్న తంబుట్టెగామలో ఒక కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించిన దిసనాయకే, తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి కావడం విశేషం. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న ఆయన, ఆ తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు.
శ్రీలంక అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే విజయం - sri lanka election results