Israel Iron Dome Technology :ఇజ్రాయెల్ పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ప్రత్యర్థులు వందలాది రాకెట్లు ప్రయోగిస్తున్నా ఉక్కు కవచంలా ఆ దాడులను అది అడ్డుకొంటోంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మూడు దశల్లో పనిచేస్తుంది. అవుటర్ లేయర్‌లో యారో-2, యారో-3 క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. ఇవి వేలాది కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకుంటాయి. అంతేకాకుండా వాటి నుంచి వెలువడే శకలాల ముప్పును నివారిస్తాయి. మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా డేవిడ్ స్లింగ్ పనిచేస్తుంది. ఇది 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఐరన్ డోమ్ వ్యవస్థ చివరిది. ఇది ఇప్పటివరకు హెజ్‌బొల్లా, హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను, క్షిపణులను సమర్థంగా అడ్డుకుని రక్షణ కల్పించింది.
10 సెకన్లలో 20 క్షిపణుల ప్రయోగం
ఐరన్ డోమ్‌ను ఇజ్రాయెల్‌లో కిప్పాట్ బార్జెల్‌గా కూడా పిలుస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. అన్ని వాతావరణ పరిస్థితులలో పని చేస్తుంది. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. రాడార్ ట్రాకింగ్ స్టేషన్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ సిస్టమ్. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది. అదే జనావాసాలు ఉంటే రాకెట్‌ను ప్రయోగించి దానిని కూల్చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్ సంస్థలు పనిచేశాయి. చివరిదైన మిసైల్ బ్యాటరీ సిస్టమ్‌లో 3 యాంటీ మిసైల్ బ్యాటరీలుంటాయి. ప్రతి ఐరన్ డోమ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొనేలా దీనిని రూపొందించారు.