Vivek Ramaswamy US Polls :రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడి, వెనకడుగు వేసిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామికి ఉపాధ్యక్ష అభ్యర్థిత్వంలోనూ గట్టి పోటీ ఎదురైంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వ రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌నకు రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష అభ్యర్థి)గా ఎవరు ఉండాలనే విషయంలో చేపట్టిన పోల్‌లో సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టి నోయెమ్, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(38) చెరో 15శాతం ఓట్లు పొందారు. నాలుగు రోజుల పాటు వాషింగ్టన్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ పోల్ నిర్వహించారు.
US Polls 2024 Vivek : భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడ్డారు. 2024 జనవరిలో జరిగిన అయోవా ప్రైమరీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న క్రిస్టి నోయెమ్ 2018లో ట్రంప్ మద్దతుతో సౌత్ డకోటాకు మొదటి మహిళా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి సమయంలో టీకాలు వేయించుకోవడం, ముఖానికి మాస్క్‌లు ధరించడానికి రాష్ట్రవ్యాప్త ఆదేశాలను జారీ చేయడానికి ఆమె నిరాకరించడం వల్ల వార్తల్లో నిలిచారు.