తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యా, ఉక్రెయిన్‌ వార్ ఫైనల్ స్టేజ్​కు వచ్చిందన్న ట్రంప్​- పుతిన్ రెస్పాన్స్ మాత్రం మరోలా! - RUSSIA UKRAINE WAR

ముగింపు దశకు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం!- అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆశాభావం- పుతిన్‌ స్పందన భిన్నం

Russia Ukraine War
Russia Ukraine War (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2025, 6:44 AM IST

Russia Ukraine War : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కొన్ని వారాల్లోనే ముగియనుందనే ఆశాభావాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఐరోపా శాంతి పరిరక్షక దళం ప్రవేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంగీకరించవచ్చని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా మధ్య కాల్పుల విరమణ సాధ్యమేనని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ పేర్కొన్నారు. అయితే వారి వ్యాఖ్యలకు భిన్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందించారు. ఇంతవరకూ పూర్తి స్థాయిలో ఎటువంటి విషయాలను చర్చించలేదని స్పష్టం చేశారు.

రష్యాతో కుదుర్చుకునే ఎటువంటి ఒప్పందమైనా ఉక్రెయిన్‌ లొంగిపోయినట్లుగా ఉండకూడదని మెక్రాన్‌ స్పష్టం చేశారు. యుద్ధానికి మూడేళ్లయిన సందర్భంగా సోమవారం వాషింగ్టన్‌లో ట్రంప్, మెక్రాన్‌ భేటీ అయ్యారు. ట్రాన్స్‌ అట్లాంటిక్‌ భవితవ్యంపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో వారి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అనంతరం వివరాలను మెక్రాన్‌ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. "కొన్ని వారాల్లోనే యుద్ధం ముగియనుందని ఆశిస్తున్నా. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలో అమెరికా రానున్నారు. కీలక టెక్నాలజీల్లో వినియోగించే తమ దేశంలోని కీలక ఖనిజాలను అమెరికాకు అందించే ఒప్పందంపై సంతకం చేస్తారు. యుద్ధం సమయంలో అమెరికా చేసిన 180 బిలియన్‌ డాలర్ల సాయాన్ని వెనక్కి తిరిగిచ్చే అంశం ఒప్పందంలో కీలకం" అని ట్రంప్‌ వెల్లడించినట్లు మెక్రాన్‌ వివరించారు.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం (Associated Press)

"ట్రంప్‌ రెండో విడత ఎంపికై శ్వేత సౌధంలో అడుగుపెట్టడమే కీలక మలుపు. కొన్ని వారాల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమని నమ్ముతున్నా. మరో 30 మంది ఐరోపా నేతలు, మిత్రులతో చర్చలు జరిపా. వారు ఉక్రెయిన్‌కు భద్రత హామీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌తో కలిసి ఆ ప్రాంతంలోకి దళాలను పంపడంపై పని చేస్తున్నాం. అవి సరిహద్దుల్లోకి వెళ్లవు, యుద్ధంలో పాల్గొనవు, కానీ ఒప్పందం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడానికి ఉంటాయి" అని మెక్రాన్‌ పేర్కొన్నారు.

భేటీ అనంతరం అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా, ఐరోపా కూటమి (ఈయూ) నిధులు ఇచ్చాయని, ఐరోపా వాటిని అప్పు రూపంలో ఇచ్చిందని ట్రంప్‌ తెలిపారు. తిరిగి ఆ మొత్తాన్ని పొందుతుందని చెప్పారు. పక్కనే ఉన్న మెక్రాన్‌.. ట్రంప్‌ చేతిని పట్టుకుని మరీ ఆపి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘వాస్తవంగా మొత్తం నిధుల్లో మేం 60 శాతం వరకూ ఇచ్చాం. అందులో అప్పులు, గ్రాంట్లు, గ్యారంటీలున్నాయి. రష్యాకు చెందిన 230 బిలియన్ల ఫ్రీజ్‌ చేసిన ఆస్తులున్నాయి’ అని మెక్రాన్‌ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు తాము ఇచ్చిన డబ్బును రష్యా నుంచి పొందుతామనే ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడారు. శాంతి అంటే ఉక్రెయిన్‌ లొంగిపోవడం కాదని భేటీ సందర్భంగా మెక్రాన్‌ వ్యాఖ్యానించారు.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం (Associated Press)

వివరంగా మాట్లాడలేదు-పుతిన్‌
యుద్ధానికి పరిష్కారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాను వివరంగా చర్చించలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. అమెరికా, రష్యా అధికారుల మధ్యా పూర్తిస్థాయి చర్చలు జరగనే లేదని సోమవారం ఆయన వెల్లడించారు. ఐరోపా దేశాలు ఆందోళనలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details