తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో ఓటేయనున్న 24కోట్ల మంది! ఆ ఎఫెక్ట్ గట్టిగా పడుతుందా?

అమెరికాలో ఓటు హక్కు వినియోగించుకోనున్న దాదాపు 24 కోట్ల మంది- గణనీయంగా పెరిగిన ఓటర్ల సంఖ్య

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

2024 US ELECTIONS
2024 US ELECTIONS (Associated Press)

US Elections 2024 CAWP Survey : అమెరికాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 244 మిలియన్ల మంది ఓటు వేయనున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటర్ల సంఖ్య పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 59 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు ఫ్యూ రీసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. 2020 ఎన్నికల్లో 66 శాతం మంది ఓటేసినట్లు పేర్కొంది. 1900 తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది. 2016 నుంచి 2020 ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ఓ అధ్యయన సంస్థ పేర్కొంది. 2016లో 18 నుంచి 29 ఏళ్లు వయస్సు యువత 39శాతం ఓటు వేసినట్లు తెలిపింది. 2020 ఎన్నికల్లో వారి శాతం 50 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 60 శాతం యువ ఓటర్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కు ఓటు వేసినట్లు సర్వేలు తెలిపాయి. 36 శాతం మంది మాత్రమే మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు ఓటేసినట్లు వెల్లడించాయి. 30 నుంచి 44 ఏళ్ల వయసు వారిలో 52 శాతానికిపైగా బైడెన్‌ వైపు మెుగ్గుచూపారు. 65 ఏళ్లు దాటినవారిలో 62 శాతం ట్రంప్‌నకు మద్దతు తెలిపారు. 2023లో ఫ్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహించిన సర్వేలో 18 నుంచి 24 ఏళ్ల యువ ఓటర్లలో 66 శాతం మంది డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతిస్తున్నట్లు తేలింది. 25 నుంచి 29 ఏళ్ల వయస్సు ఓటర్లలో 64 శాతం మంది డెమోక్రటిక్‌ పార్టీ వైపు మెుగ్గు చూపినట్లు సర్వే వెల్లడించింది. మెుత్తంగా యువ ఓటర్లలో 55 శాతం డెమోక్రటిక్‌ వైపు ఉండగా 42 శాతం రిపబ్లికన్ల వైపు ఉన్నట్లు తెలిపింది. 80ఏళ్లు పైబడినవారిలో 58 శాతం మంది రిపబ్లికన్‌ పార్టీకి మద్దతివ్వగా 39 శాతం డెమోక్రటిక్‌ పార్టీ వైపు నిలిచినట్లు సర్వేలో వెల్లడైంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతి అనేది ప్రధానాంశంగా మారింది. జాతుల మధ్య అసమానతలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2020 ఎన్నికల్లో 71 శాతం మంది శ్వేత జాతీయులు ఓటు హక్కు వినియోగించుకోగా, 58.4 శాతం శ్వేత జాతీయులు కానీవారు ఓటు వేసినట్లు బ్రెన్నాన్ సెంటర్ ఫర్ జస్టిస్ లా అండ్ పాలసీ సంస్థ పేర్కొంది. వారిలో 62.6 శాతం మంది నల్లజాతీయ అమెరికన్లు ఉండగా, 53.7 శాతం లాటిన్ అమెరికన్లు, 59.7 శాతం ఆసియా అమెరికన్లు ఉన్నట్లు తెలిపింది. గత కొన్నేళ్లుగా అమెరికాలో అనేక రాష్ర్టాలు ఓటు నమోదును కష్టతరం చేశాయని వెల్లడించింది. ప్రధానంగా రిపబ్లికన్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు మరింత కఠినంగా అమలు చేసినట్లు చెప్పింది.

నల్లజాతీ అమెరికన్లలో ఎక్కువ శాతం మంది డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతు ఉంటుందని ఎగ్జిట్‌ పోల్స్ చెబుతున్నాయి. 2020లో ఏకంగా 87 శాతం నల్లజాతీ అమెరికన్లు బైడెన్‌కు ఓటు వేసినట్లు ఎగ్జిట్‌ పోల్స్ చెప్పాయి. అదే శ్వేతజాతీయ ఓటర్లలో 58 శాతం మంది ట్రంప్‌నకు ఓటు వేసినట్లు వెల్లడించాయి. 65 శాతం మంది లాటిన్‌ అమెరికన్లు, 61 శాతం మంది ఆసియా అమెరికన్లు బైడెన్‌కు ఓటు వేసినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. 2020లో నల్లజాతీయుల ఓటర్లు 2024కు 7 శాతం పెరిగి 34 మిలియన్లకు చేరినట్లు అంచనా వేశాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1980 నుంచి పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2020 ఎన్నికల్లో 68.4 శాతం మంది మహిళలు ఓటు వేయగా, పురుషులు 65 శాతం మంది ఓటేశారు. 1996 ఎన్నికల నుంచి మహిళా ఓటర్లలో ఎక్కువ శాతం మంది డెమోక్రటిక్‌ పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్లు సెంటర్ ఫర్ అమెరికన్ ఉమెన్ అండ్ పాలిటిక్స్- CAWP తెలిపింది. 2020 ఎన్నికల్లో 57 శాతం మంది మహిళలు బైడెన్‌కు ఓటు వేయగా, 42 శాతం మంది ట్రంప్‌నకు ఓటేశారు.

అయితే, శ్వేత జాతీయ మహిళ ఓటర్లలో 55 శాతం మంది మాత్రం ట్రంప్‌నుకు మద్దతిచ్చారు. 42 శాతం మంది మాత్రమే బైడెన్‌ వైపు నిలిచినట్లు CAWP తెలిపింది. అదే నల్ల జాతీయ మహిళల్లో ఏకంగా 90 శాతం మంది బైడెన్‌కు ఓటు వేయగా, ట్రంప్‌నకు కేవలం 9 శాతం ఓటింగ్‌ మాత్రమే దక్కింది. పురుషుల ఓట్లలో 53 శాతం ట్రంప్‌నకు రాగా, 45 శాతం బైడెన్‌కు వచ్చినట్లు CAWP వెల్లడించింది.

అమెరికా అధ్యక్ష పీఠం కమలదే- సైంటిస్ట్​ జోస్యం- 40 ఏళ్లలో ఒక్కసారీ తప్పు చెప్పని లిచ్​మన్

ట్రంప్​ vs హారిస్​- ఎవరికీ స్పష్టమైన అధిక్యం లేదు! అమెరికా ఓటర్లు ఏమనుకుంటున్నారంటే? - US Presidential Election 2024

ABOUT THE AUTHOR

...view details