POK People Protests : పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎట్టకేలకు ఆందోళనలను విరమించారు నిరసనకారులు. తమ డిమాండ్లను పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించడం వల్ల కొన్ని రోజులుగా చేపడుతున్న ఆందోళనలను మంగళవారం మధ్యాహ్నం నుంచి విరమిస్తున్నట్లు నిరసనకారులు ప్రకటించారు. భద్రతాబలగాల కాల్పుల్లో మరణించిన వ్యక్తుల పట్ల సంతాపంగా శాంతియుత ప్రదర్శన నిర్వహించారు.
తమ డిమాండ్లను ఆమోదించినందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ-JAAC నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆందోళనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మరణించిన ముగ్గురి కుటుంబాలకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనల సందర్భంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసి, కేసులు రద్దు చేయాలని JAAC మరో ప్రతినిధి కోరారు.
అంతకుముందు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలు తీవ్రమైన వేళ పాకిస్థాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పీఓకేకు రూ.2,300 కోట్ల రాయితీ నిధులను విడుదల చేస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రకటించారు. 40 కిలోల గోధుమపిండి బస్తా ధరను 1100 రూపాయలు(పాక్ కరెన్సీ) తగ్గిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు కూడా ఆమోదం తెలిపారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఆందోళనకారులు తమ నిరసనలను విరమించారు.