Trump Putin Phone Call :ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో మాట్లాడారని వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. వారివురి మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదని వెల్లడించింది. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, అదంతా తప్పుడు ప్రచారమని చెప్పింది.
గత గురువారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు చెప్పింది. యుద్ధంపై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు వెల్లడించింది. దీనిపైనే తాజాగా రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది.
"సమాచారం నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఈ కథనాలను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం. ఇదంతా ఊహాజనిత, తప్పుడు సమాచారం" అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కొట్టిపారేశారు. ట్రంప్, పుతిన్ మధ్య చర్చల కోసం ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు.