Trump Harris Debate :అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారపర్వం జోరుగా కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌కు సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఏబీసీ టీవీ ఛానల్లో చర్చకు రెడీ అని తెలిపారు.
మూడు డిబేట్లకు ప్రతిపాదన
సెప్టెంబరులో మూడు టీవీ ఛానళ్లలో డిబేట్‌కు రావాలని కమలకు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించారు. సెప్టెంబరు 4, 10, 25 తేదీల్లో చర్చకు రావాలని ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. అందుకు హారిస్ అంగీకరిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, డొనాల్ట్ ట్రంప్ కమలతో డిబేట్ సిద్ధమైనట్లు ఏబీసీ టీవీ ఛానల్ ధ్రువీకరించింది. సెప్టెంబరు 10వ తేదీన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డిబేట్లో పాల్గొంటారని ఒక ప్రకటనలో తెలిపింది.
"డిబేట్ ద్వారా వివాదాలు పెట్టుకోవడం నా ఉద్దేశం కాదు. మరోవైపు డిబేట్లో నిబంధనలను కమల అంగీకరించాలి. ఆమె అందుకు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. కమలతో డిబేట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను డిబేట్ లో రికార్డును సెట్ చేయాలని భావిస్తున్నాను. వచ్చే నెలలో సీబీఎస్ న్యూస్ వైస్ ప్రెసిడెంట్ డిబేట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనేందుకు ముందుకొచ్చి నా రన్నింగ్ మేట్, ఓహియో సెనేటర్ జేడీ వాన్స్ మంచి పనిచేశారు" అని డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు.