Trump Gunshots : అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ పేర్కొంది.
ఇదీ జరిగింది
ట్రంప్‌నకు గోల్ఫ్ ఆడే అలవాటు ఉంది. అప్పుడప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్న భోజనానికి ముందు వరకు వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం మగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్, ఆదివారం గోల్ఫ్ ఆడుతున్నారు. గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్‌యూవీలో పారిపోయాడని, పోలీసులు వెంబడించి అతడిని పట్టుకున్నట్లు చెప్పారు. ఘటన ప్రాంతంలో ఏకే 47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పుల జరిగాయా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు.
అమెరికాలో హింసకు తావులేదు
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 'ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మన దేశంలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటిస్తున్నా. ట్రంప్‌నకు అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించా' అని పేర్కొన్నారు. ట్రంప్ క్షేమంగానే ఉన్నట్లు తమకు సమాచారం అందిందని ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఎక్స్ వేదికగా స్పందించారు.