Israel strikes chemical weapons sites in Syria :సిరియాలోని అనుమానిత రసాయన ఆయుధాగారాలు, దీర్ఘశ్రేణి రాకెట్లపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. శత్రువుల చేతికి చిక్కకుండా దాడుల జరిపి వాటిని ధ్వంసం చేశామని సోమవారం ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అలాగే ఇరాన్, హెజ్బొల్లాకు మద్దతు ఇస్తున్న అసద్ ప్రభుత్వం కూలిపోవడాన్ని స్వాగతించింది. అయితే సిరియాలో తదుపరి ఎవరు పగ్గాలు చేపడతారో అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది.
'సిరియా పరిస్థితి ఆందోళనకరం'
"ఇరాన్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌నకు కీలక మిత్రుడైన అసద్ ప్రభుత్వం కూలిపోవడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే సిరియాలో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నాం. 1974 నాటి ఒప్పందం ప్రకారం సిరియాలోని బఫర్‌జోన్‌ను బలగాలు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాయి. మాకు పౌరుల భద్రత ముఖ్యం. అందుకే మేము వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలపై దాడి చేశాం. తీవ్రవాదుల చేతుల్లో పడకూడదని సిరియాలోని రసాయన ఆయుధాగారాలు, దీర్ఘశ్రేణి క్షిపణులు, రాకెట్లపై దాడులు జరిపాం." అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ వ్యాఖ్యానించారు.
విమానాశ్రయంపై దాడులు
సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోని మెజ్జే సైనిక విమానాశ్రయం ప్రాంతంలో ఆదివారం వైమానిక దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు చేసిందెవరనే విషయం ఇంకా తెలియలేదు. ఈ విమానాశ్రయం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లక్ష్యంగా ఉండేది. తాజాగా సిరియాలోని రసాయన ఆయుధాగారాలు, రాకెట్లపై దాడులు జరిపింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించడం గమనార్హం.