తెలంగాణ

telangana

ETV Bharat / international

2060 నాటికి భారత జనాభా 170 కోట్లు- 63.3 కోట్లకు పడిపోనున్న చైనా! - un report on population - UN REPORT ON POPULATION

India Population Report : భారత జనాభా 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. తర్వాత 12శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది. 2100 వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు 'వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2024' పేరిట గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. 2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63కోట్లకు పరిమితం కానుందని ఐరాస నివేదిక తెలిపింది.

india population report
india population report (ETV Bharat, Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 1:00 PM IST

India Population Report :గతేడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్‌, ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2024లో భారత్‌ జనాభా 145 కోట్లని అంచనా వేసింది. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. భారత జనాభా 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. తర్వాత 12శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగొస్తుందని తెలిపింది.

2100 నాటికి చైనా కంటే రెండున్నర రెట్లు ఎక్కువ
ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది. 2100 నాటికి అది 63.3 కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది. 2100 నాటికి చైనా జనాభా కంటే భారత జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపింది. 2024-54 మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుందని ఐరాస నివేదిక పేర్కొంది. జపాన్‌, రష్యాలోనూ జనాభా వేగంగా దిగొస్తుందని వెల్లడించింది. ఐరాస నివేదిక అంచనా ప్రకారం 2024-54 మధ్య చైనా జనాభా 20 కోట్లు, జపాన్‌ జనాభా 2 కోట్లు, రష్యా జనాభా కోటి తగ్గనుంది. 2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది.

సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే కారణం
2024లో 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080ల్లో గరిష్ఠానికి చేరుతుందని ఐరాస నివేదిక అంచనా వేసింది. వచ్చే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుకుని అక్కడి నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణమని ఐరాస నివేదిక వివరించింది. చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవితకాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు తెలిపింది. సంతాన సాఫల్యత రేటు 2.1 ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాసలో జనాభా విభాగాధిపతి జాన్‌ విల్మోత్‌ తెలిపారు. 1.8 లేదా 1.5 కంటే తక్కువకు చేరితే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొన్నారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అదే జరుగుతోందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details