India China Conflict : భారత్-చైనా సైన్యాల మధ్య మరోసారి సాయుధ ఘర్షణ జరిగే ప్రమాదం ఉందని అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అమెరికాకు చెందిన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్-డీఎన్ఐ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇప్పటికే ఇరుదేశాలు భారీ సంఖ్యలో తమ దళాలను సరిహద్దులకు తరలించాయని పేర్కొంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, అందుకు సరిహద్దు వివాదం ప్రధాన కారణంగా మారినట్లు తెలిపింది.
2020 తర్వాత సరిహద్దుల వెంట ఇరుదేశ సైన్యాల మధ్య ఘర్షణలు జరగకపోయినా ఇరువైపులా బలగాల మోహరింపు మాత్రం భారీగా పెరిగినట్లు అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి సమయంలో అపోహలు, తప్పుడు అంచనాలతో సాయుధ ఘర్షణల ముప్పు పొంచి ఉంటుందని డీఎన్‌ఐ తన నివేదికలో వెల్లడించింది.
'లద్దాఖ్ సెక్టార్‌లో 50వేల చొప్పున బలగాలు'
2020 మే నెలలో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నుంచి భారత్-చైనాలు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ముమ్మరంగా చేపడుతున్నట్లు అమెరికా నిఘా విభాగం తన నివేదికలో పేర్కొంది. లద్దాఖ్ సెక్టార్‌లో ఇరుదేశాలు 50వేల చొప్పున బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నంత వరకు ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది.
'ఎన్నికల బిజీలో భారత్'
మరోవైపు ఇస్లామాబాద్ కవ్వింపుచర్యలకు దిగితే భారత్-పాక్ మధ్య సాయుధ ఘర్షణ జరిగే ప్రమాదం ఉన్నట్లు డీఎన్‌ఐ అంచనా వేసింది. 2021 తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం తిరిగి చేసుకోవడం వల్ల ఉద్రిక్తతలు తగ్గినట్లు పేర్కొంది. ఈ సమయాన్ని ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించకుండా దేశీయ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది. భారత్ ఎన్నికల సన్నాహాలు, ప్రచారంపై దృష్టి సారించగా పాకిస్థాన్ పశ్చిమప్రాంతంలో మిలిటెంట్ దాడులతో సతమతమవుతున్నట్లు అమెరికా నిఘా విభాగం పేర్కొంది.