తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ ఎన్నికల వేళ ఇమ్రాన్​కు ఊరట- 12 కేసుల్లో బెయిల్​

Imran Khan Bail : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సైనిక కార్యాలయాలపై దాడుల కేసుల్లో బెయిల్​ లభించింది. ఆ కేసుల్లో మిగతా నిందితులందరూ బెయిల్‌పై ఉన్నందున ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలులో ఉంచడం సరికాదని తీర్పునిచ్చింది కోర్టు.

Imran Khan Bail
Imran Khan Bail

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 1:54 PM IST

Updated : Feb 10, 2024, 3:10 PM IST

Imran Khan Bail :పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. 2023 మే9 నాటి సైనిక కార్యాలయాలపై దాడుల కేసుల్లో పీటీఐ అధినేతకు యాంటీ టెర్రరిజం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 12కేసుల్లో లక్ష పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. సైనిక కార్యాలయం, ఆర్మీ మ్యూజియంపై దాడుల కేసుల్లో మిగతా నిందితులందరూ బెయిల్‌పై ఉన్నందున ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలులో ఉంచడం సరికాదని తీర్పునిచ్చింది.

ఇదే కేసులో మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీకి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే తోషఖానాతో పాటు అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసుల్లో జైలు శిక్ష పడినందున ఇమ్రాన్‌ ఖాన్‌ కారాగారంలోనే ఉండనున్నారు. కాగా, అవినీతి కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు అనంతరం పాకిస్థాన్‌లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ జనరల్‌ హెడ్‌క్వార్టర్స్‌పై దాడితో పాటు కార్యాలయంలోని సున్నితమైన సమాచారాన్ని దొంగలించారని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు పలువురిపై కేసు నమోదైంది.

ఆ కేసులో 14ఏళ్ల జైలు శిక్ష
ఇటీవలే తోషఖానా కేసులో ఇటీవలే ఇమ్రాన్​ దంపతులకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. చట్ట విరుద్ధమైన వివాహం కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా ఇద్దరికీ రూ.5 లక్షల చొప్పున కోర్టు జరిమానా విధించింది

ఇదీ కేసు!
బుష్రా బీబీ, ఇమ్రాన్​ ఖాన్​ను రెండో పెళ్లి చేసుకున్నారు. దీన్ని ఆమె మొదటి భర్త ఖవార్​ మనేకా వ్యతిరేకించారు. రెండు వివాహాల మధ్య తప్పనిసరిగా విరామం పాటించే ఇస్లామిక్​ ఆచారాన్ని (ఇద్దత్​) బుష్రా బీబీ ఉల్లంఘించారని కేసు వేశారు. వారిద్దరు పెళ్లి చేసుకోకముందే వివాహేతర బంధంలో ఉన్నారని ఆరోపించారు. అది రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించే స్థాయి నేరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖవార్​ మనేకా వేసిన కేసుపై 14 గంటల సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఇమ్రాన్​, బుష్రాకు ఏడేళ్ల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడే క్రమంలో వారిద్దరూ కోర్టు హాలులోనే ఉన్నారు.

Last Updated : Feb 10, 2024, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details