Hamas Military Wing Chief Dead :గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన మెరుపుదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హమాస్ మిలటరీ వింగ్ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ హతమయ్యారు. ఈ మేరకు జులైలో జరిగిన దాడిలోనే డెయిఫ్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం గురువారం ధ్రువీకరించింది. ఇంటెలిజెన్స్ వివరాలను అనుసరించి నిర్ధరణకు వచ్చినట్లు తెలిపింది.
దక్షిణ గాజా నగరం అయిన ఖాన్ యూనిస్‌పై జులై 13న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆ దాడిలో స్థానికంగా గూడారాల్లో ఉన్న పౌరులు సహా 90మందికి పైగా మరణించినట్లు అప్పడు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆ దాడిలో డెయిఫ్ మరణించినట్లు వెంటనే ధ్రువీకరణ కాలేదు. తాజాగా దీనిపై ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై హమాస్ ఇంకా స్పందించలేదు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా బుధవారం(2024 జులై 31) హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో తమ పాత్ర ఉందని గానీ, లేదని గానీ ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ ఇరాన్ మాత్రం హనియా హత్యకు ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని శపథం చేసింది. దానికి తోడు హనియా హత్య జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ చేసిన ఈ ప్రకటనతో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉంది.
డెయిఫ్ కోసం మొస్సాద్ ఆపరేషన్లు
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడులకు దిగారు. ఈ భయంకర దాడిలో దాదాపు 1200మంది ప్రాణాలు కోల్పోయారు. 250మందిని హమాస్ బందీలుగా తీసుకుంది. అయితే ఈ మారణహోమానికి మహమ్మద్ డెయిఫ్, యెహ్యా సిన్వార్ ప్రధాన సూత్రధారులని ఇజ్రాయెల్ విశ్వసిస్తోంది. ఇక ఇజ్రాయెల్ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్ నెట్‌వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా డెయిఫ్ అన్న వాదనలు ఉన్నాయి. దీంతో డెయిఫ్, సిన్వార్ సహా ఇస్మాయిల్ హనియాను అంతమొందించడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు రచించింది. డెయిఫ్ కోసం ఇజ్రాయెల్ సైన్యం, గూఢచార సంస్థ మెుస్సాద్ ఏడు ఆపరేషన్లు చేపట్టాయి. ప్రతిసారీ వెంట్రుకవాసిలో వాటి నుంచి మహమ్మద్ డెయిఫ్ బయటపడ్డారు. అయితే డెయిఫ్, హనియా ఇప్పటికే మరణించారు. సిన్వార్ ఆచూకీని మాత్రం ఇజ్రాయెల్ కనుక్కోలేకపోతోంది.
హమాస్ మిలటరీ వింగ్, కస్సం బ్రిగేడ్స్ వ్యవస్థాపకుల్లో మహమ్మద్ డెయిఫ్ ఒకరు. 1990ల్లో కొన్నేళ్లు ఆ యూనిట్‌కు నాయకత్వం వహించారు. ఈయన నేతృత్వంలో హమాస్, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వందలాది ఆత్మాహుతి దాడులు జరిపింది. హమాస్ బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్‌కు డెయిఫ్ సన్నిహితుడు. అయ్యాష్ గతంలో ఇజ్రాయెల్ దళాలపై పలు బాంబుదాడులు చేశారు. ఆయన ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాక, 2002లో డెయిఫ్ హమాస్ మిలటరీ వింగ్ నాయకత్వ పదవిని చేపట్టారు.
హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారం - ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సిద్ధం - Hamas Chief Haniyeh Murder
స్కూల్, హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ దాడి- చిన్నారులు సహా 30మంది మృతి