H1B Visa Overhaul : అమెరికాలో ఉద్యోగాలు చేయాలని అనుకునే యువతకు జో బైడెన్ కార్యవర్గం ఓ గూడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1 బి వీసాలను సరళీకరిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. తద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకోవడాన్ని సులభతరం చేసింది. అంతేకాకుండా సులువుగా ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించింది. ఇది లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కల్పించనుంది.
భారతీయులకు గుడ్‌న్యూస్- ఇకపై H-1B వీసా ప్రాసెస్ ఈజీ! - H1B VISA OVERHAUL
విదేశీ విద్యార్థులు, వ్యాపారవేత్తలకు శుభవార్త చెప్పిన బైడెన్ సర్కార్- హెచ్-1బీ వీసాలను సరళీకరిస్తూ కొత్త నిబంధనల ప్రకటన
Published : 6 hours ago
పోటీ ఇచ్చేందుకే
హెచ్-1బీ వీసా నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను ఈ వీసా ద్వారా నియమించుకొంటుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాలు దీని నుంచి చాలా లబ్ధి పొందాయి. ఈ క్రమంలోనే కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) కొత్త నిబంధనలను ప్రకటించింది. దీనిప్రకారం నాన్‌ప్రాఫిట్, ప్రభుత్వేతర పరిశోధన సంస్థల నిర్వచనం, నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దీని ప్రకారం సంస్థలు అవసరాలకు తగినట్లు నియామకాలు చేసుకొని ప్రపంచ మార్కెట్లో పోటీ ఇచ్చేందుకు ఉపయోగపడతాయని డీహెచ్ఎస్ పేర్కొంది.
ఈ కొత్త నిబంధన ప్రకారం ఎఫ్-1 విద్యార్థి వీసాలను తేలిగ్గా హెచ్-1బీ వీసాలుగా మార్చుకొనే అవకాశం కల్పించడం వల్ల ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్లైంది. గతంలోనే హెచ్-1బీ వీసా పొందినవారి పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను కూడా వేగంగా ప్రాసెస్ చేయనున్నారు. అమెరికాలోని వ్యాపార సంస్థలకు కార్మికుల అవసరాలు తీర్చేందుకు బైడెన్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లుగా సమచారం. ఆ సంస్థలపై పడుతున్న అనవసర ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక కొత్త విధానంలో లేబర్ కండీషన్ అప్లికేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు 2025 జనవరి 17 నుంచి అమలుకానున్నాయి. అమెరికాలో ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలకు, అదనంగా మరో 20 వేల అడ్వాన్స్ డిగ్రీ వీసాలకు అనుమతి ఇస్తుంది.