India China Talks On Border Issues : సరిహద్దుల్లో శాంతి, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ చర్చలు జరిపారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం సహా అనేక అంశాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్, అజిత్ ఢోబాల్ చర్చించుకున్నారు.
గల్వాన్ లోయ ఉద్రిక్తతల తర్వాత ఇదే తొలిసారి
గల్వాన్ లోయ ప్రతిష్టంభన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ భారత్, చైనా సరిహద్దు సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపాయి. చైనా ప్రత్యేక ప్రతినిధుల చర్చల 23వ రౌండ్‌లో పాల్గొనేందుకు భారత ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఢోబాల్ చైనా పర్యటనకు వెళ్లారు. 2019లో చైనా, భారత్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిలిచిపోయాయి.
మోదీ, జిన్‌పింగ్ భేటీ- ముందుకు సాగిన చర్చలు
అక్టోబరు 24న రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఆ తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. అయితే ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య కుదిరిన ఉమ్మడి అవగాహన సందర్భంగా భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా మంగళవారం తెలిపింది. భారత్ చర్చలకు సానుకూలంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కీలక దౌత్య సంబంధిత చర్చలు జరుగుతాయని పేర్కొంది.
'భారత్‌తో విభేదాల పరిష్కారానికి సిద్ధం'
భారత్‌తో ఉన్న విభేదాలను చిత్తశుద్ధితో పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. చైనా, భారత నాయకుల మధ్య కుదిరిన ఉమ్మడి అవగాహనను అమలు చేస్తామని పేర్కొన్నారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలు, విశ్వాశాలను బలోపేతం చేయడానికి చైనా సిద్ధమని వెల్లడించారు. చైనా, భారత్ మధ్య సంబంధాలు స్థిరమైన, ఆహ్లాదకరమైన అభివృద్ధికి దారితీస్తాయని అభిప్రాయపడ్డారు.
ఆ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాలు
2020లో తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా, భారత్ బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అక్టోబరు 21న గల్వాన్ లోయ ప్రతిష్టంభన తర్వాత సరిహద్దు నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కితగ్గాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్, చైనా మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు సమస్యను సమగ్రంగా పరిష్కరించే ఉద్దేశంతో 2003లో ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకు 22 సార్లు సమావేశమైంది. చివరి సారిగా 2019లో చర్చలు జరిపింది. తాజాగా మూడోసారి సమావేశమై ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యలపై చర్చించింది.