తెలంగాణ

telangana

ETV Bharat / international

కెనడా,మెక్సికోపై 25% టారిఫ్‌లు- మార్చి 4న అమల్లోకి- అమెరికన్లకు రెట్టింపు కష్టాలు! - CANADA MEXICO TARIFFS

కెనడా, మెక్సికోపై సుంకాలు- మార్చి 4న అమల్లోకి వస్తుందన్న ట్రంప్- త్వరలోనే రివెంజ్ టారిఫ్​లు

Canada Mexico Tariffs
US president Donald Trump (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 2:25 PM IST

Canada Mexico Tariffs :కెనడా, మెక్సికో ఉత్పత్తులపై ప్రకటించిన 25 శాతం సుంకాలను నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవి మార్చి 4వ తేదీన అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై ఏప్రిల్‌ నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ట్రంప్‌ నిర్ణయం వాణిజ్య యుద్ధానికి దారి తీసి ధరల పెరుగుదలకు కారణమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కెనడా, మెక్సికోపై విధించిన 25 శాతం సుంకాలు మార్చి 4న అమల్లోకి వస్తాయని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ టారిఫ్‌లు ఫిబ్రవరి 4న అమలు కావాల్సి ఉంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాలపై విధించిన అదనపు సుంకాలను నెలరోజుల పాటు తాత్కాలికంగా ట్రంప్ నిలిపివేశారు. ఇన్నాళ్లు కెనడా, మెక్సికోలే కాకుండా చాలా దేశాలు తమపై అధిక సుంకాలు విధించాయని, తమ నిధులను దుర్వినియోగం చేసి, ప్రయోజనాలు పొందాయని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై ఎంత సుంకాలు విధిస్తున్నాయో తాము కూడా ఆయా దేశాల ఉత్పత్తులపై అంతే సుంకాలు విధిస్తామని తెలిపిన ట్రంప్‌ ఈ ప్రతీకార సుంకాలు ఏప్రిల్‌ నుంచి మొదలుకావొచ్చని తెలిపారు.

'ట్రంప్ నిర్ణయాల వల్ల ధరలు పెరుగుతాయ్'
అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు ధరల పెరుగుదలకు దారి తీసి, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాల ధరలు మరింత పెరిగి, అమెరికన్ల కష్టాలు రెట్టింపు కావచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలున్నాయని యేల్‌లోని బడ్జెట్‌ ల్యాబ్‌ విశ్లేషించింది. ఈ అంశంలో ట్రంప్‌ వాదన మరోలా ఉంది. అమెరికా దిగుమతులపై విధించే సుంకాలు ఆదాయాన్ని పెంచుతాయని, అమెరికా ప్రభుత్వ బడ్జెట్‌ లోటును భర్తీ చేస్తాయని, కార్మికులకు కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ట్రంప్‌ అంటున్నారు. మళ్లీ అమెరికా సుసంపన్నంగా మారుతుందని అన్నారు. అమెరికా విధించే సుంకాల వల్ల వినియోగదారులు, రిటైలర్లు, తయారీదారులపై భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ధరల పెరుగుదల అంశం ప్రధానంగా నిలిచింది. బైడెన్‌ హయాంలోని పెరిగిన ధరలను అదుపులోకి తెస్తారని భావించే ట్రంప్‌నకు ఓటర్లు పట్టంకట్టారు. కానీ ట్రంప్‌ తీసుకునే నిర్ణయాలు ధరల పెరుగుదల దిశగా సాగుతున్నాయి. కెనడా, మెక్సికో, ఐరోపా దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తే ధరలు మరింత పెరగనున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాతోపాటు చైనాపైనా ట్రంప్‌ సుంకాల కొరడా ఝళిపించారు. దీర్ఘకాలిక మిత్రదేశాలైన కెనడా, మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తూ ఆర్డర్లపై సంతకం చేశారు. కెనడా నుంచి అమెరికాకు వచ్చే ఇంధనం, విద్యుత్‌పై మాత్రం 10 శాతం సుంకం విధించారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని చురకలు అంటించారు. అమెరికా సుంకాలు విధిస్తే తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా, మెక్సికో ఇప్పటికే ప్రకటించాయి.

ABOUT THE AUTHOR

...view details