తెలంగాణ

telangana

ETV Bharat / international

వైరస్ తీవ్రత తక్కువే- మా దేశానికి ఎవరైనా డౌట్​ లేకుండా రావొచ్చు: చైనా - CHINA NEW VIRUS 2025

హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తిపై స్పందించిన చైనా- శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని చెప్పిన విదేశాంగ శాఖ

China New Virus 2025
China New Virus 2025 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 10:31 PM IST

China New Virus 2025 : చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆ దేశం స్పందించింది. వ్యాప్తిని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఈ వైరస్‌ కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న నివేదికలను తోసిపుచ్చింది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని పేర్కొంది. విదేశీయులు తమ దేశంలో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

"ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో ఈ ఇన్‌ఫెక్షన్లు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. వ్యాధుల తీవ్రత తక్కువగానే కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తిలో ఉన్నాయి. చైనా పౌరులతో పాటు ఇక్కడున్న విదేశీయుల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని భరోసా ఇస్తున్నా. చైనాలో పర్యటించడం సురక్షితమే" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ పేర్కొన్నారు. చైనాలో ఇన్‌ఫ్లుయెంజాతోపాటు ఇతర శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తిపై అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. శీతాకాలంలో ఈ వ్యాధుల నిర్మూలన, నియంత్రణకు సంబంధించి నేషనల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.

మరోవైపు చైనాలో హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ వ్యాప్తి భారీ స్థాయిలో ఉందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వైరస్‌ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా వ్యాప్తిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

లక్షణాలేంటి?
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది. దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, తాకడం వంటి చర్యలతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ. 2001లోనే గుర్తించిన ఈ హెచ్‌ఎంపీవీకి వ్యాక్సిన్‌, నిర్దిష్టమైన చికిత్స లేవు. లక్షణాలకు అనుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details