Biden Netanyahu : గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఏడుగురు సహాయక సిబ్బంది మరణించిన ఘటన తర్వాత నెతన్యాహు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ముందునుంచి అండగా ఉంటున్న అమెరికా కూడా తాజాగా ఆ దేశానికి పరోక్షంగా చురకలంటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో గురువారం ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు పలు సూచనలు చేశారు. గాజాతో ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో సామాన్య పౌరులు, సహాయక సిబ్బందిని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై భవిష్యత్తులో తమ మద్దతు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
30 నిమిషాలు ఫోన్లో
అంతేకాకుండా కాల్పుల విరమణ తప్పనిసరి అని చెప్పారు. ఆలస్యం చేయకుండా గాజాతో ఈ విషయమై ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్‌ను బైడెన్ కోరినట్టు శ్వేతసౌధం తెలిపింది. ఇటీవల ఏడుగురు 'వరల్డ్ సెంట్రల్ కిచెన్' సహాయక సిబ్బందిపై జరిగిన ఘటనపై ఇజ్రాయెల్ స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చిన నేపథ్యంలో బైడెన్, నెతన్యాహుతో ఫోన్లో 30 నిమిషాల పాటు సంభాషించారు.
మాది పెద్ద తప్పే : ఇజ్రాయెల్
Israel Attack On WCK Employees :సోమవారం గాజా పౌరులకు ఆహార సామగ్రిని అందించేందుకు వెళ్లిన 'వరల్డ్ సెంట్రల్ కిచెన్' (డబ్ల్యూసీకే) స్వచ్ఛంద సంస్థకు చెందిన సహాయక సిబ్బందిపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఆరుగురు విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్ ఒకరు సహా మొత్తం ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. మానవతా సాయం అందిస్తున్న సిబ్బందిపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై పెదవి విరిచాయి. ఈ ఘటనను దుందుడుకు చర్యగా అభివర్ణిస్తూ ఇజ్రాయెల్‌ను వివరణ కోరాయి.