20 Miners Killed In Pakistan :నైరుతి పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో కొందరు ముష్కరులు జరిపిన దాడిలో 20 మంది గని కార్మికులు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అక్టోబర్ 15, 16 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ (ఎస్సీఓ) జరగనుంది. దీనికి కొన్ని రోజుల ముందు ముష్కరులు దాడి చేసి, బలూచిస్థాన్‌లోని గని కార్మికులను హతమార్చడం గమనార్హం.
గురువారం అర్థరాత్రి బలూచిస్థాన్ ప్రావిన్స్, దుకీ జిల్లాలోని బొగ్గు గని వద్ద ఉన్న వసతి గృహాల్లోకి ముష్కరులు చొరబడ్డారు. అక్కడ గని కార్మికులందరినీ చుట్టుముట్టి కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. మృతుల్లో చాలా మంది పురుషులు బలూచిస్థాన్‌లోని పష్తూన్ భాష మాట్లాడే ప్రాంతాలకు చెందినవారు. అంతేకాదు మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్గనిస్థాన్ పౌరులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడికి బాధ్యులమని ఎవరూ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం.
పంజాబ్ ప్రజలే టార్గెట్!
పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇదే తరహా దాడులు గత కొద్ది నెలలుగా బలూచిస్థాన్‌లో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనూ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సాయుధులు రెచ్చిపోయారు. రెండు ఘటనల్లో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందిని సాయుధులు కిందకు దింపి మరీ కాల్చి చంపారు. తర్వాత 12 వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. అనంతరం పర్వత భూభాగంలోకి సాయుధులు పారిపోయారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నోష్కి సమీపంలో తొమ్మిది మంది ప్రయాణికులను బస్సు నుంచి దింపారు సాయుధులు. అనంతరం వారి ఐడీ కార్డులను తనిఖీ చేసి చంపేశారు. గతేడాది అక్టోబరులో కూడా కచ్ జిల్లాలోని టర్బత్ ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన ఆరుగురు కూలీలను గుర్తుతెలియని ముష్కరులు కాల్చి చంపారు. మృతులందరూ దక్షిణ పంజాబ్‌కు చెందినవారే. 2015లో తుర్బాత్ సమీపంలోని కార్మికుల శిబిరంపై ముష్కరులు దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది నిర్మాణ కార్మికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పాక్‌లో భద్రత ఉందా?
ఇటీవల పాకిస్థాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.