World Health Day 2024 : తెల్లవారుజామునే నిద్రలేవడం, రాత్రి త్వరగా పడుకోవడం, ప్రకృతిని ఆస్వాదిస్తూ రోజంతా ఒళ్లు వంచి పనులు చేసుకోవటం. అంతే కాకుండా సహజసిద్ధంగా పండే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలను తినడం. ఆరుబయట గాలిని పీలుస్తుండటం, స్వచ్ఛమైన నీటిని తాగుతూ ప్రశాంతంగా బతకడం. ఇది ఒకప్పటి జీవన శైలి. కానీ ఇప్పుడలా కాదు, కూర్చున్న చోటే అన్ని పనులు అవుతున్నాయి. సహజ సిద్ధమైన ఆహారాలు, సంప్రదాయక వంటలు పూర్తిగా కనుమురుగు అయిపోయాయి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్‌కు నేటి సమాజం బాగా అలవాటు పడిపోతుంది.
అంతే కాదు సమయానికి తినడం దాదాపు మర్చిపోయామనే చెప్పొచ్చు. వేళా పాళా అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేస్తున్నాం. గాడి తప్పిన మన జీవినశైలి, అదుపు తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా మనం ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నాం. ఈ జీవనశైలి కారణంగా మనం ఎదుర్కొంటున్న జబ్బులేంటో? వాటి నివారణ చర్యలు తెలుసుకుందాం.
డయాబెటీస్
జీవన శైలిలో సమతుల్యత తప్పితే అనారోగ్యం దరిచేరినట్టే. నేటి ఉరుకుల పరుగుల జీవనం కారణంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం. వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని షుగర్ సమస్య ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి బయట పడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, సాధారణ శారీరక శ్రమ, బరువు నియంత్రణ అవసరం. ముఖ్యంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
హై బీపీ (రక్తపోటు)
హైబీపీని సైలెంట్ కిల్లర్‌గా చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే రక్తపోటు పెరిగిపోతున్న చాలా కాలం పాటు మనం గుర్తించలేమట. కొందరిలో అధిక రక్తపోటు కారణంగా ఆయాసం, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటివి కనిపిస్తాయట. ఇంకొందరిలో అవేవీ కనిపించావు. కిడ్నీ జబ్బులు, పక్షవాతం లాంటి వాటికి హైబీపీనే ముఖ్య కారణంగా నిలుస్తుంది. వీటితో పాటు రక్తపోటు ఎక్కువ అయితే. మెదడు, కళ్లు, గుండె, మూత్రపిండాల సమస్యలుకు కారణమవుతుంది.
దీన్ని నివారించాలంటే ఒత్తిడిని తగించకోవడం చాలా ముఖ్యం. తక్కువ కొవ్వు కలిగిన ఆహారాలను తినడం, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వంటి వాటిని వాడకుండా ఉండటం, పాలు వ్యాయామం చేయడం వల్ల హైబీపీని నివారించవచ్చు.
గుండె జబ్బులు
ఒకప్పుడు గుండె జబ్బులు అంటే 60ఏళ్లు పైబడిన వారికి వస్తాయని అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు దీనికి వయసుతో సంబంధం లేకుండా అయిపోయింది. మనం తినే ఆహరం, రోజూవారీ అలవాట్లు, నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, జీవన శైలి మన గుండెపై తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. గుండె జబ్బుల నివారణకు వ్యాయామం చాలా ముఖ్యం. అలాగే మనం తినే ఆహారాల్లో ఎక్కువ కొవ్వుపదార్థాలు లేకుండా ఉండాలి. అలాగే జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, మద్యపానం, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. తృణధాన్యాలు, ఆకుకూరలు వంటివి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఊబకాయం
మనం తినే ఆహారానికి తగినంత శారీరక శ్రమ చేసినప్పుడు మనకు ఎలాంటి జబ్బులు రావు. కానీ ప్రస్తుతం మనం తినే ఆహారంలో కెమికల్స్, నూనెలు ఎక్కువ అవుతుంటే శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం కాలంలో సమయం కూడా లేక వాకింగ్, రన్నింగ్ వంటివి కూడా చేయడం లేదు. గాడితప్పిన తిండితీరు, కూర్చుని చేసే పని కారణంగా మనం బరువును నియంత్రణలో ఉంచుకోలేకపోతున్నాం. ఫలితంగా పది మందిలో ఆరుగురు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని నుంచి బయట పడాలంటే ఎక్కువ ఫైబర్, తక్కువ కొవ్వులు కలిగిన ఆహరాలు తినాలి. అలాగే తినగానే స్నానం చేయడం, నిద్రపోవడం లాంటివి అస్సలు చేయకూడదు.
ఒత్తిడి
కేవలం శారీరకంగా మనం బాగుంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాల్సి ఉంటుంది. మానసికంగా మనం ఎదుర్కొనే ఒత్తిళ్లు, ఆందోళనలు మనం ఆరోగ్యంపై కనిపించని ప్రభావం చూపిస్తాయి. వాస్తవానికి ఒత్తిడి కారణంగా నిద్రలేమి, హైబీపీ, మూడ్ స్వింగ్స్, అతిగా ఆకలి లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు కారణమయే సమస్యలు వస్తుంటాయి. అందుకే మనం వీలైనంత వరకూ మన మెదడును ప్రశాంతంగా ఉంచాల్సి ఉంటుంది. ఇందుకు ప్రకృతిలో ఎక్కువ సమయం గడపటం, మెడిటేషన్, యోగా లాంటివి చేయడం. మ్యూజిక్ వినడం లాంటివి చేస్తుండాలి.
మొత్తం మీద నేటీ జీవనశైలిలో కలిగే చాలా ప్రమాదకరమైన జబ్బులన్నింటికీ ముఖ్యమైన నివారణ వ్యాయామం. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కారణం శారీరక శ్రమ తగ్గడమే. ప్రతి రోజూ కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయడం, వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వంటివి అలవాటు చేసుకోవడం అవసరం. కనీసం రోజుకు 30నిమిషాల పాటు వాకింగ్ అయినా తప్పకుండా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు ధీమాగా చెబుతున్నారు. వ్యాయమాల కారణంగా శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి మనం తినే ఆహారం చక్కగా ఒంటబడుతుంది. శరీరంలో సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్, ఎండోర్ఫిన్స్ పెరిగి శారీరక ఆరోగ్య సమస్యలతో పాటు ఒత్తిళ్లు, ఆందోళనకు దూరంగా ఉంటాం.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అవుట్డోర్ vs ట్రెడ్మిల్ - వాకింగ్ చేయడానికి ఈ రెండిట్లో ఏది మంచిది? - Outdoors Vs Treadmill for Walking
అలర్ట్ : మీ ఒంట్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నారు! - Excessive Salt Consumption Signs