World Dosa Day 2024 :ప్రస్తుత కాలంలో చాలా మంది తమ టిఫిన్‌లో భాగంగా దోశలను ఇష్టంగా తింటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే వాటిలో దోశ ఒకటి. అయితే రోజూ దోశ తినడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చాలా మందికి సందేహం కలగవచ్చు. దీనిపై నిపుణులు ఏమని సలహాలు ఇస్తున్నారో చూద్దాం. దీంతో పాటు ప్రపంచ దోశ దినోత్సవం (మార్చి 3) సందర్భంగా వాటి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
దోశలు ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవచ్చా?
Can We Eat Dosa Daily : 'ఒక వేళ బ్రేక్‌ఫాస్ట్‌గా రోజూ దోశలను తింటున్నట్లైతే పిండి తయారీలో వివిధ రకాల గింజలు ఉపయోగించాలి. దాంతో పాటు కరివేపాకు, మెంతికూర, పాలకూర లాంటి కూరగాయలను కూడా చేర్చి దోశలను తయారుచేసుకున్నట్లయితే ప్రతిరోజూ తినవచ్చు. ఇందువల్ల వాటి పోషక విలువలు మారుతుంటాయి. అల్మండ్, పిస్తా ఇలాంటి వాటిని చట్నీల్లో చేర్చి తీసుకున్నట్లయితే దోశను కూడా సమతుల్య ఆహారంలా తీసుకోవచ్చు. దోశలకు తక్కువ అయిల్ను ఉపయోగించడం వల్ల కేలరీస్కు కూడా ఇబ్బంది ఉండదు' అని పోషకాహార నిపుణురాలు డాక్టర్ లహరి సూరపనేని సూచిస్తున్నారు.
దోశ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Health Benefits Of Dosa : దోశ ఒక వైవిధ్యమైన ఆహార పదార్థం. వీటిని బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌గానూ తీసుకోవచ్చు. దోశలు ఆహారంగా తీసుకుంటే చాలా త్వరగా జీర్ణమవుతుంది. లంచ్‌లో రైస్‌కు బదులుగా దోశలను తీసుకోవచ్చు. దోశలతో పాటు కొబ్బరి, టమాటా చట్నీలను తీసుకుంటే మరింత రుచికరంగా ఉంటాయి.
- కార్భోహైడ్రేట్లు : శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే శక్తి అవసరం. ఈ శక్తి కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుంది. దోశల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు దోశలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం మంచి ఆప్షన్.
- ప్రోటీన్ పదార్థాలు :దోశల్లో ఉండే మరో పోషక పదార్థం ప్రోటీన్. జుట్టు దృఢత్వానికి ఇవి చాలా తోడ్పడతాయి. ఎముకలు పటిష్ఠంగా ఉండేందుకు ప్రోటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
- తక్కువ క్యాలరీలు :దోశలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. సింగిల్ ప్లెయిన్ దోశలో 37 క్యాలరీలు ఉంటాయి. ఏదైనా వేరే పదార్థాలను దోశలకు చేర్చి తీసుకున్నప్పుడు క్యాలరీలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఇండియన్ వంటకాలు తీసుకునేటప్పుడు వాటిలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో చూసుకుని తీసుకోవడం మంచిది.
- ఆరోగ్యానికి :మీరు తీసుకునే ఆహారంలో దోశలను భాగం చేయడం వల్ల శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే దోశ తీసుకునేటప్పుడు వివిధ రకాల కాంబినేషన్లలో చట్నీలు తయారు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు రుచికరమైన ఫుడ్‌ను ఆరగించవచ్చని చెబుతున్నారు.